Revanth reddy: కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరు నేతల పరిస్థితి ఏంటి? వారు సడన్ గా సైలెంట్ అయ్యారు ఎందుకు? పీసీసీ కిరీటం దక్కలేదనా? లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని అసంత్రుప్తా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ నేతలు ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ లో అధ్యక్షుడి పదవి అంటేనే తీవ్ర పోటీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వివపరీతంగా ఉంటుంది. అటువంటిది అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో టీపీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారా? అని ఎదురుచూశారు. దీనికి రెండు వారాల కిందట తెరదించిన కాంగ్రెస్ అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ పదవికి తీవ్రంగా పోటీ పడ్డారు నిజామాబాద్ కు చెందిన మాజీ ఎంపీ మధుయాస్కీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
పీసీసీ అధ్యక్ష పదవి భర్తీ తరువాత మధు యాష్కీ సైలెంట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఓడిపోయారు. అందుకే పార్టీ పగ్గాలైనా అప్పగించాలని ఈ బీసీ నేత కోరారు. కానీ ఎందుకో సీఎం రేవంత్ సహకరించలేదని తెలుస్తోంది. రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పీఠం ఇచ్చినప్పుడు సీనియర్లు సహాయ నిరాకరణ చేశారు. ఆ సమయంలో నేనున్నాను అంటూ అండగా నిలబడ్డారు మధు యాష్కీ. కానీ అదే మధుయాస్కీకి ఇప్పుడు రేవంత్ అండగా నిలబడలేదు. కేవలం మరో అధికార కేంద్రం అవుతారని భావించి రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గుచూపినట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం నడుస్తోంది. అయితే అదును చూసి దెబ్బేసిన రేవంత్ పై మధుయాష్కీ కోపంతో రగిలిపోతున్నట్టు సమాచారం. అందుకే వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మధు యాష్కీ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్. నిజామాబాద్ నుంచి 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన మధు యాస్కీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహతులు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వేరే వైపు వెళ్లలేదు. నిజామాబాద్ నుంచి 2019లో ఓటమి తర్వాత ఆయన గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ నుంచి పోటీ చేశారు. కానీ మరోసారి ఓటమే ఎదురైంది. ఇలాంటి సమయంలో టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడ్డారు. తన సామాజిక వర్గానికే చెందిన మహేష్ కుమార్ గౌడ్ తో చివరి వరకు రేసులో నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం ఉన్న మహేష్ గౌడ్ కే పదవి దక్కింది. మధు యాస్కీ గతంలో విదేశాల్లో ఉండి వచ్చారు. హైదరాబాద్ హయత్ నగర్ ను స్వస్థలంగా పేర్కొనే ఆయన 2004 ఎన్నికల సమయానికి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2009 తర్వాత మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు.
తూర్పు జగ్గారెడ్డి సైతం సీనియర్ నాయకుడు. రేవంత్ నాయకత్వాన్ని ఆదిలో బాహటంగానే వ్యతిరేకించారు. కానీ ఇటీవల మాత్రం పొగడ్తలతో ముంచెత్తారు. అదంతా పీసీసీ పీఠం కోసమేనని ప్రచారం జరిగింది. అయినా సరే ఆ పదవి దక్కలేదు. దీంతో రేవంత్ పై కోపంతో జగ్గారెడ్డి మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. బీజేపీ నేపథ్యంతో మున్సిపల్ చైర్మన్ అయిన ఆయన 2004లో అప్పటి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు. 2009లోనూ నెగ్గారు. 2014లో ఓడారు. 2018లో గెలిచినా, గత ఏడాది ఓటమి చవిచూశారు. అయితే 2014 తర్వాత జగ్గారెడ్డి మధ్యలో బీజేపీలోకి వెళ్లారు. ఆపై కాంగ్రెస్ లోకి తిరిగివచ్చారు. దీంతోనే ఆయనను పార్టీ విశ్వాసంలోకి తీసుకోలేదు. కాకపోతే కాస్త ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసింది. జగ్గారెడ్డి భార్య నిర్మల గౌడ్ సామాజికవర్గానికి చెందినవారు. ఆమెతో పాటు కుమార్తెనూ కాంగ్రెస్ లో కీలక స్థానాల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన రేవంత్ రెడ్డి తో పాటు మూడేళ్ల కిందట కూడా టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడ్డారు. అది దక్కకపోవడంతో అసమ్మతి రాజకీయాలు చేశారు. రెండేళ్ల కిందట పార్టీ సమావేశం జరుగుతుండగా బయటకు వచ్చి బైక్ పై వెళ్లిపోయారు. మధ్యలో బీఆర్ఎస్ లో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. అలా ఏమీ జరగలేదు. కానీ, నిరుటి ఎన్నికల్లో ఓటమి జగ్గారెడ్డి అవకాశాలను బాగా దెబ్బతీసింది. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవి కూడా దక్కలేదు.
గత వారం టీపీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకారం అట్టహాసంగా జరిగింది. నిత్యం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పొగిడే జగ్గారెడ్డి మాత్రం దీనికి హాజరుకాలేదు. సొంత సామాజికవర్గానికి చెందిన మహేష్ గౌడ్ అధ్యక్షుడిగా అత్యంత కీలక బాధ్యతల్లోకి వస్తున్నా మధు యాస్కీ గౌడ్ కూడా దూరంగా ఉన్నారు. దీంతో ఇద్దరు నేతల పరిస్థితి ఏంటన్న చర్చ కాంగ్రెస్ లో కొనసాగుతోంది. వీరిద్దరూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదపడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది