Tuesday, January 21, 2025

Congress-Bjp: కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్స్.. సీఎం రేవంత్ ను పొగిడిన రాజా సింగ్

- Advertisement -

Congress-Bjp: కాంగ్రెస్, బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేందుకు ఆ రెండు పార్టీలు కలిసిపోయాయా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల లక్ష్యం బీఆర్ఎస్ ను ఎలాగైనా అడ్డుకోవడమేనని తెలుస్తోంది. ప్రజలు మరోసారి బీఆర్ఎస్ వైపు చూస్తే మాత్రం తమకు ఇబ్బందులు తప్పవని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఆ పార్టీ ఎదగకుండా చక్కటి అవగాహనతో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రచ్చ జరిగినప్పుడు బీజేపీ సైలెంట్ గా ఉంది. కేంద్ర ప్రభుత్వం కవితను అరెస్టు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటించింది.

సాటి ప్రతిపక్షంగా కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ కు మద్దతు తెలపాల్సిన బీజేపీ ఆ పనిచేయడం లేదు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం లోపయికారీగా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలతో బీజేపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా రెండు పార్టీల మధ్య పరస్పర సహకారం ఉన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేయడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కృతజ్ఞతలు తెలపడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికి కారణమైంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గణేష్ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో స్వయంగా పర్యవేక్షించడం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇంతకు ముందు హైడ్రా కూల్చివేతలపైన కూడా రేవంత్ కు తన మద్దతు అందించిన రాజా సింగ్ ఓవైసీ కళాశాలలు, నివాసాలు ఆక్రమణలని, వాటిని కూడా కూల్చాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి తన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు రాజా సింగ్.

హైదరాబాద్ లో అత్యంత ఘనంగా సాగుతున్న వినాయక నిమజ్జనాలను సీఎం రేవంత్ రెడ్డి తానే వచ్చి స్వయంగా పర్యవేక్షించడం హర్షించదగిన విషయమని రేవంత్ రెడ్డికి రాజాసింగ్ కితాబిచ్చారు. బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభా యాత్రలో పాల్గొన్న రాజాసింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈసారి గణేష్ నిమజ్జనోత్సవానికి ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు బాగా పనిచేశాయని ప్రశంసించిన రాజసింగ్ ముఖ్యంగా ఈసారి పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది అన్నారు. గణేష్ శోభాయాత్రను, నిమజ్జనోత్సవాన్ని స్పెషల్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించి స్వయంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించడం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించడం చాలా సంతోషాన్ని కలిగించిందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి దర్శించుకుని తొలి పూజ కూడా చేసినట్టుగా పేర్కొన్న రాజాసింగ్ ఎప్పటికప్పుడు గణేష్ నిమజ్జన ఉత్సవానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారని ఇది నిజంగా మెచ్చుకోవాల్సిన అంశమని కొనియాడారు. గతంలో ఎప్పుడు గణేష్ నిమజ్జన సమయంలో ఏ సీఎం ఈ తరహా పనితీరును కనబరచలేదని, రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కుతుందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కొనియాడారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే.. అందునా వివాదాస్పద కామెంట్స్ చేయడంలో ముందుండే రాజాసింగ్ ఏకంగా సీఎం రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీస్తోంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!