పిఠాపురం వర్మ రాజకీయాలకు గుడ్ బై చెబుతారా? పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా? విసిగి వేసారి పోయారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర పరిణామం జరుగుతోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో వర్మ డిఫెన్స్ లో పడిపోయారు. నమ్మి మోసపోయానని ఆవేదనతో ఉన్నారు.
పిఠాపురంలో వర్మకు మంచి పట్టు ఉంది. వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. సొంత ఓటు బ్యాంకు కూడా కొనసాగుతోంది. అటువంటి నేత ప్రమేయం లేకుండా పవన్ కళ్యాణ్ గెలిచారని నాగబాబు వ్యాఖ్యానించడంతో వర్మ పూర్తి ఆవేదనతో ఉన్నారు. ఎన్నికల వరకు మెగా కుటుంబం తనకు ప్రాధాన్యమిచ్చిందని.. తాను అంతే నమ్మకంతో పని చేస్తే ఇప్పుడు దారుణంగా మాట్లాడుతోందని ఆవేదనతో ఉన్నారు వర్మ.
అయితే తనను మెగా బ్రదర్ నాగబాబు టార్గెట్ చేసినా.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. తనకు అండగా నిలిచిన దాఖలాలు కూడా లేవు. కనీసం సోషల్ మీడియా వేదికగా వచ్చిన మద్దతు కూడా మచ్చుకైనా పార్టీ నుంచి రాలేదు. ఇదే ఎక్కువ ఆవేదనకు గురిచేస్తోందని వర్మ తన సన్నిహితులు వద్ద బాధపడుతున్నట్లు తెలిసింది.
వర్మ కు మంచి ఇమేజ్ ఉంది. 2009లో తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు వర్మ. కానీ ఐదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడ్డారు. సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు కూడా టికెట్ నిరాకరించారు చంద్రబాబు. అయితే వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ విక్టరీ కొట్టారు. అదే వర్మను చంద్రబాబు పిలిచి మరి చేరదీశారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఓడిపోయారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా గెలుస్తారన్న అంచనాలు ఉండేవి. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది.
ఒకానొక దశలో 2014 ఎన్నికలు మాదిరిగానే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి చేశారు. అలా చేసి ఉంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ విజయం పై ప్రభావం చూపేవారు. కానీ అధినేత ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అంకితభావంతో పనిచేశారు. పవన్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ అటువంటి నేతను ఉద్దేశించి నాగబాబు ఆ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆయనకు తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.
చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నెరవేరలేదు. జనసేన నేతల నుంచి గౌరవం దక్కడం లేదు. దీంతో రాజకీయాల్లో ఉండి ఇటువంటి అగౌరవం పడడం ఏంటని వర్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ సన్యాసం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.