జగన్మోహన్ రెడ్డికి జనంలో ఎనలేని క్రేజ్ ఉంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచి అదే పరిస్థితి కొనసాగుతోంది. అన్నింటికీ మించి కాంగ్రెస్ పార్టీ ఆయనను ఇబ్బందులు పెట్టిన తరువాత ఇంకాస్త జనాదరణ పెరిగింది. జనాల్లో తనకొంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అదే క్రేజ్ కొనసాగుతుండడం విశేషం.
ఉగాది నుంచి జనం బాట పట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వారంలో నాలుగు రోజులు పాటు గడపాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
అయితే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్న క్రమంలో జనాలు చుట్టుముడుతున్నారు. జన సమీకరణ చేయకుండానే భారీగా జనాలు వస్తున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత పాలవలస రాజశేఖర్ అకాల మరణంతో ఆ జిల్లాకు వెళ్లారు. జనం నీరాజనాలు పలికారు. అంతకుముందు వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కూడా జనం బ్రహ్మరథం పట్టారు.
తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ సందర్భంలో సైతం జగన్మోహన్ రెడ్డికి జనం నీరాజనాలు పలికారు. జనంలో జగన్కు క్రేజ్ తగ్గలేదని నిరూపించారు.
మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. అటు జగన్మోహన్ రెడ్డి ఓటు అనేది ప్రత్యేకంగా ఉండిపోయింది. పైగా అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించారన్న సానుభూతి ఉంది. అయితే సాధారణ పర్యటనలకే జనం ఈ స్థాయిలో వస్తే.. అధికారిక పర్యటనలకు ఏ స్థాయిలో వస్తారో అర్థం చేసుకోవచ్చు.
ఉగాది తరువాత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతోంది. షెడ్యూల్ సైతం ఖరారు చేసే పనిలో వైసిపి నాయకత్వం ఉంది. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ తగ్గలేదని తాజా పర్యటనల ద్వారా నిరూపితం అయింది. అందుకే ఆయన జిల్లాల పర్యటనపై భారీ అంచనాలు ఉన్నాయి.