ఆయన ఓ సీనియర్ ఎమ్మెల్యే. వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. కానీ ఆయన సీనియారిటీకి తగ్గ గౌరవం లభించడం లేదు. సిన్సియారిటీని కూడా గుర్తించడం లేదు
. దీంతో పార్టీ అధినేత పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కధ? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.
ఉమ్మడి ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్ జ్యోతుల నెహ్రూ. మొన్నటికి మొన్న ఎన్నికల్లో జగ్గంపేట నుంచి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో ఆయనకు చాన్స్ దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో మండిపోతున్నారు. పోనీ స్పీకర్ పదవి ఇస్తారని భావించారు. బీసీ కోటాలో అయ్యన్నపాత్రుడు తన్నుకు పోయారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఆశించారు. రఘురామకృష్ణంరాజు కు కేటాయించేసరికి నీరుగారిపోయారు.
వాస్తవానికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. 1994లో తొలిసారిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1999లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. 2004లో మాత్రం ఓడిపోయారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2013లో జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు జ్యోతుల నెహ్రూ. కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. 2019లో మాత్రం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో జగ్గంపేట నుంచి గెలిచి సీనియర్ నేతగా అసెంబ్లీలో గుర్తింపు పొందారు. కానీ తన సీనియారిటీకి తగిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదన ఆయనలో ఉంది.
ఉభయగోదావరి జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్గా శాసనసభలో ఉన్నారు జ్యోతుల నెహ్రూ. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనను చంద్రబాబు పట్టించుకోవడం లేదట. పదవులు ఇవ్వలేదు సరి కదా కనీసం నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటామన్న చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని బాధతో ఉన్నారు.
మొన్న ఆ మధ్యన శాసనసభలో జ్యోతుల నెహ్రూకు దారుణ అవమానం జరిగింది. డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు నెహ్రూ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఆ సమయంలో జ్యోతుల నెహ్రూ ఎంతో బాధపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎనలేని గౌరవం దక్కేదని.. అనవసరంగా టిడిపిలోకి వచ్చానని ఆయన బాధపడ్డారట. పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం ఎన్నికలకు ముందే జ్యోతుల నెహ్రూ కేవలం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు.