Tuesday, April 22, 2025

వర్మతో ముద్రగడ చర్చలు.. జగన్ దూతగా ఎంట్రీ!

- Advertisement -

పిఠాపురం రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం తనదేనంటూ సంకేతాలు ఇస్తున్నారు వర్మ. వచ్చే ఎన్నికల నాటికి పట్టు బిగించాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి కంటే వచ్చే ఎన్నికల్లో పవన్ ఓటమిని శాసించాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. ఒక వ్యూహం ప్రకారం పని చేయడం ప్రారంభించారు. అవసరం అనుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధం అని సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది.

రెండు రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలపై జిల్లా కలెక్టర్ ను కలిశారు వర్మ. నియోజకవర్గంలో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పిఠాపురం మున్సిపాలిటీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని.. తక్షణం స్పందించాలని ఆయన కోరారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ కు చెక్ చెప్పేందుకే వర్మ కలెక్టర్ ను కలిసారని ప్రచారం నడుస్తోంది.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ఆరోపించారు. ఆ పార్టీ లైన్లోనే వర్మ మాట్లాడుతున్నారని.. టిడిపి అధినేత చంద్రబాబును సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ అంశం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం అందరిలో బలపడింది.

అయితే పిఠాపురం వర్మ విషయంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె స్పందించడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందట ముద్రగడ పద్మనాభం వర్మకు టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి దూతగా ముద్రగడ వర్మతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

పిఠాపురం నియోజకవర్గంలో వర్మ కు మంచి పట్టు ఉంది. గతంలో టిడిపి టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆయన. సూపర్ విక్టరీ కూడా సాధించారు. ఆయనకంటూ నియోజకవర్గంలో ప్రత్యేక క్యాడర్ ఉంది. అందుకే ఎమ్మెల్సీ పదవి కోసం టిడిపిలో ఉంటే తన కు భవిష్యత్తు ఉండదని వర్మ భావిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి.. టిడిపి తో పాటు జనసేన ను దెబ్బతీయాలని భావిస్తున్నారు.

ఎప్పుడైతే ముద్రగడతో వర్మ చర్చలు జరిపారు అప్పుడే ముద్రగడ కుమార్తె క్రాంతి తెరపైకి వచ్చారు. వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం వర్మ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ వర్మ కు టిడిపి హై కమాండ్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన.. పిఠాపురం నియోజకవర్గ టికెట్ విషయంలో మాత్రం భరోసా ఇవ్వదు. ఇది కచ్చితంగా వర్మకు తెలుసు. ఒకటి ఎమ్మెల్సీ పదవి తీసుకుని సైలెంట్ గా ఉండాలి. జనసేన పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు గౌరవం ఇచ్చే అవకాశం లేదు. ఒకవైపు భవిష్యత్తు లేక.. మరోవైపు గౌరవం లేని కూటమిలో ఉండడం దండగ అని వర్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ పద్మనాభంతో జరిగిన చర్చలు లీకు కావడంతో జనసేన స్పందించినట్లు తెలుస్తోంది. మరి తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో గుంభనంగా ఉంటోంది. మరి వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!