జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా పై ఫోకస్ పెట్టారా? విజయవాడ పార్లమెంట్ స్థానానికి కొత్త ఇన్చార్జిని ప్రకటించనున్నారా? పనిలో పనిగా గుడివాడ, గన్నవరం ఇన్చార్జిలను కూడా ప్రకటిస్తారా? ఈ మేరకు కసరత్తు జరుగుతోందా? జిల్లాల పర్యటనకు ముందే అక్కడ ఇన్చార్జిలు రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి విజయవాడ పార్లమెంట్ స్థానంలో పట్టు చిక్కడం లేదు. 2014, 2019,2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది తెలుగుదేశం పార్టీ. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని గెలిచారు. 2024 ఎన్నికల్లో మాత్రం అదే కేసినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారారు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని శివనాధ్ గెలిచారు.
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేశినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తనకు ఏ పార్టీతోను సంబంధం లేదని తేల్చి చెప్పారు. క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్ పదవి ఖాళీగా ఉంది. బలమైన కమ్మ సామాజిక వర్గం నేత కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో సైతం కొత్త అభ్యర్థిని బరిలోదించాలని చూస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. అక్కడ నుంచి వైసీపీకి ప్రాతినిధ్యం వహించారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు కొడాలి నాని. 2014, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి చేపట్టారు. ఆయన చుట్టూ ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే ఇంతలో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. అందుకే ఆయన స్థానంలో కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా తలసీల రఘురాం పేరు వినిపిస్తోంది. అంతకంటే సమర్ధుడైన నేత దొరికితే విను వెంటనే ఇన్చార్జిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గన్నవరం నియోజకవర్గ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టినట్లు సమాచారం. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జిగా వల్లభనేని వంశీ ఉండేవారు. కానీ ఆయన చుట్టూ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇప్పట్లో కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ తరుణంలో అక్కడ కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తారని సమాచారం.
ప్రధానంగా సుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ వచ్చారు. ఒకానొక దశలో పిసిసి అధ్యక్షురాలిగా ఆమె పేరు వినిపించింది. అయితే షర్మిల నియామకాన్ని ఆమె వ్యతిరేకించారు. ఇప్పటికీ రెబల్ గా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పద్మశ్రీ విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో వల్లభనేని వంశీ మోహన్ భార్య పంకజశ్రీ సైతం తనకు ఇన్చార్జి పోస్టును కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సో ఆ ఇద్దరి మహిళా నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే కృష్ణాజిల్లా పై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టడం విశేషం.