మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను టిడిపి పక్కన పెట్టిందా? లేకుంటే ఆయనే సైడ్ అయ్యారా? గత కొంతకాలంగా దేవినేని ఉమ కనిపించడం లేదు ఎందుకు? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉమ బ్యాడ్ టైం ను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఎక్కువగా హైదరాబాద్ కి పరిమితం అయిపోతున్నట్లు తెలుస్తోంది. కనీసం టిడిపి కేంద్ర కార్యాలయం వైపు ఆయన చూడడం మానేశారు. దీంతో రకరకాల చర్చ నడుస్తోంది.
ఉమా అంటే కృష్ణాజిల్లా.. కృష్ణా జిల్లా అంటే ఉమా అన్నట్టు పరిస్థితి ఉండేది. అంతలా చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యమిచ్చే వారు. లోకేష్ సైతం ఉమా విషయంలో మంచి అభిప్రాయంతో ఉండేవారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు అవకాశం లేదు. కోటమీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి కేటాయించలేదు. దీంతో ఉమా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగానే ఎండగట్టే వారు ఉమా. ఒకటి రెండు సార్లు కేసులు ఎదుర్కొన్నారు. జైలు పాలయ్యారు కూడా. కానీ ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది. మైలవరం టికెట్ను వసంత కృష్ణ ప్రసాద్ కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఉమా త్యాగాన్ని మరువలేమని.. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆయనకు పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ హామీ అమలు కాకపోవడంతో ఉమా మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమా మాదిరిగానే సీటు త్యాగం చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. తెనాలి టికెట్ ను నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు ఆ సీటు కేటాయించారు. దీంతో ఆలపాటి రాజా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి న్యాయం చేశారు. ఆలపాటి రాజాకు న్యాయం చేశారు కానీ.. ఉమా విషయంలో మాత్రం న్యాయం చేయలేకపోయారన్న కామెంట్ వినిపిస్తోంది.
వాస్తవానికి ఉమా చంద్రబాబుతో పాటు లోకేష్ కు ఎంతో విధేయుడు. ఉమా తీరుతోనే చాలామంది టీడీపీ నేతలు పార్టీకి దూరమయ్యారని అప్పట్లో ప్రచారం నడిచింది. అటు చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించే కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో సీరియస్ గా ఉండేవారు దేవినేని ఉమ. వారికి టార్గెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పార్టీ కోసం ఇంత చేసిన తనకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదనతో ఉన్నట్లు సమాచారం.
1999లో తొలిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారు దేవినేని ఉమ. సోదరుడు దేవినేని రమణ అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నందిగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా రెండుసార్లు గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తో మైలవరానికి మారారు. ఆ ఎన్నికల్లో కూడా గెలిచిన ఉమా చంద్రబాబు ఆదేశాలతో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన సాగునీటి శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2019లో ఓడిపోయిన ఉమా మాత్రం పార్టీ కోసం పనిచేశారు. 2024 ఎన్నికల్లో సీట్ త్యాగం చేశారు. అయితే ఇంత చేసిన చంద్రబాబుతో పాటు లోకేష్ తన విషయంలో అన్యాయం చేశారన్న ఆవేదనతో ఉన్నారు. అందుకే పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అయ్యారు.