ఏపీలో ఓ సంచలన సర్వే హల్చల్ చేస్తోంది. కూటమి పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ సర్వే సంస్థ ఐఐటి నిపుణులతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించిందట. సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయట. దాదాపు 50 శాతానికి పైగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. వారి అవినీతి పతాక స్థాయికి చేరిందట. సదరు సర్వే చేసిన సంస్థ కూడా ఆశ్చర్యపడేలా అవినీతి పెరిగిందట.
సరిగ్గా 10 నెలల కిందట ఏపీలో అధికారంలోకి వచ్చింది కూటమి. మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. తెలుగుదేశం పార్టీ సోలోగానే 135 సీట్లలో పాగా వేసింది. జనసేన అయితే శతశాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ సైతం ఓట్లు, సీట్లు పెంచుకొని ఔరా అనిపించింది. కానీ 10 నెలల వ్యవధిలోనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు భారీ వ్యతిరేకతను ఎదుర్కోవడం విశేషం.
ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కూటమిలోని ప్రజాప్రతినిధులపై ఏకంగా 70 శాతం వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాల 71. ఈ సర్వే నివేదిక కూటమి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాలుగా మారిపోయారని తెలుస్తోంది. కొంతమంది మంత్రులు అయితే నేరుగా రియల్ ఎస్టేట్, ల్యాండ్ మాఫియా అవతారం ఎత్తినట్లు సర్వేలో తేలింది. నియోజకవర్గాల్లో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచాలు పిండుతున్నట్లు స్పష్టమైంది. మైనింగ్ మాఫియా తో పాటు కాంట్రాక్టర్ ల నుంచి వసూళ్ల పర్వం నడుస్తోంది.
మరోవైపు చాలామంది ఎమ్మెల్యేలు క్యాడర్ కు అందుబాటులో ఉండడం లేదట. అయితే కొందరు ఎమ్మెల్యేలు అయితే చిన్న చిన్న వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులను సైతం వదలడం లేదట. భారీగా వారి నుండి డబ్బు దోచేస్తున్నారట. ఈ సంచలన సర్వేలో అదే ప్రధాన అంశంగా మారింది.
ఈ 10 నెలల్లో కూటమి సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. కేవలం 30 శాతం మంది మాత్రమే పాజిటివిటీ ఉన్న ఎమ్మెల్యేలుగా మిగిలారట.
ఈ సర్వే సంస్థ నివేదికలో 71 మంది ఎమ్మెల్యేలను పరిశీలిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయిదుగురు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐదుగురు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు, కృష్ణాజిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఉన్న నలుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు, వైయస్సార్ కడప జిల్లాలో ముగ్గురు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడుగురు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు 70 శాతం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఇది నిజంగా కూటమికి ప్రమాదకరమే.