Thursday, December 12, 2024

Ponguleti Srinivasa Reddy: టార్గెట్ మినిస్టర్ పొంగులేటి..రంగంలోకి కేంద్ర సంస్థలు

- Advertisement -

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కేంద్రం ఫోకస్ పెట్టిందా? దారికి తెచ్చుకోవాలని భావిస్తోందా? కేంద్ర నిఘా సంస్థలకు పని చెప్పిందా? ఇక నుంచి వరుసగా కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు సంస్థలు పడనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ పై పడ్డ బీజేపీ దృష్టి.. ఇక నుంచి కాంగ్రెస్ పైనేనని స్పష్టమైంది. ఎట్టి పరిస్థితుల్లో వెంటాడి..వేటాడాలని నిర్ణయించిట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ మహిళా నేత కవిత అరెస్టు సమయంలో ఆహ్వానించినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు కేంద్రం తాజా చర్యలు ఎంతమాత్రం మింగుడు పడడం లేదు. కేంద్రం దూకుడుతో కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. మరికొందరైతే ముందస్తుగానే బీజేపీ నేతలతో సంధి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ టార్గెట్ లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఆయన టార్గెట్ అయ్యారు. హైదరాబాద్‌లో గల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు దిగారు.ఈడీ అధికారులు, ఇతర సిబ్బందితో కూడిన మొత్తం 16 బృందాలు నిన్న ఉదయం నుంచి పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై దాడులు కొనసాగిస్తోన్నాయి. ఏకకాలంలో తనిఖీలకు దిగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను వాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి గతేడాది కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు దక్కాయి. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కనస్ట్రక్షన్స్‌ అధినేతగా ఉన్నారు. ఈ సంస్థ పలు రాష్ట్రాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, వంతెనలు ఇతర నిర్మాణ పనుల్లో ఉంది. భారీ కాంట్రాక్టు పనులు చేపడుతోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో గల ఆయన ఇంటిపైనా కూడా దాడులు సాగిస్తోన్నట్లు సమాచారం. కాగా- ఈ దాడుల్లో హైదరాబాద్ రీజియన్ ఈడీ కార్యాలయానికి చెందిన అధికారులు ఎవ్వరూ పాల్గొనలేదని చెబుతున్నారు. 16 టీమ్‌ల అధికారులు, సిబ్బంది మొత్తం కూడా ఢిల్లీ నుంచే దిగారని, అక్కడి జోనల్ కార్యాలయ అధికారులే ఇందులో పాల్గొన్నారని అంటున్నారు. నారాయణ్‌పేట్- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులను ఈ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం మొదలైన తరువాతే ఈడీ రంగంలోకి దిగిందనే వాదనలూ లేకపోలేదు. గతంలో కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈడీ దాడులను ఎదుర్కొన్నారు.

ఆదాయానికి తగ్గట్టు ఆదాయ పన్ను చెల్లించకపోవడం, మనీలాండరింగ్‌ వంటి ఆరోపణలతో ఈడీ ఆయన నివాసాలు, కార్యాలయాల్లో దాడులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతేడాది కూడా నవంబర్‌ 3న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలతోపాటు హైదరాబాద్‌ లోని నందగిరి హిల్స్‌ లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న రాఘవ ఫ్రైడ్‌ లోనూ అధికారులు తనిఖీలు చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సోదాల సందర్భంగా ఆయన ఇంట్లోనే ఉన్నారా, లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఆయన అనుచరులు కూడా ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదు. దాడులు పూర్తయ్యాక ఈడీ అధికారులు దీనిపైన ప్రకటన చేస్తారని సమాచారం.

మరోవంక ఈ దాడుల పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఈ సోదాలు సాగుతున్నాయని మండిపడింది. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ ఆరోపిస్తోంది. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణాపై పడింది. అయితే మున్ముందు ఎవరిపై కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు పడతాయోనన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!