కడప జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి పావులు కదుపుతోంది. అయితే అది అంత ఈజీగా దొరికే పని కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీ జడ్పిటిసి లను తీసుకుని ప్రత్యేక శిబిరం నిర్వహిస్తోంది. ఈనెల 27న వారు కడపకు చేరుకోనున్నారు.
2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కడప కార్పొరేషన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. 50 జడ్పీటీసీలకు గాను 49 జడ్పిటిసి లను కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒకే ఒక జడ్పిటిసి కి పరిమితం అయింది. జిల్లా పరిషత్ చైర్మన్ గా అమర్నాథ్ రెడ్డి ఎంపికయ్యారు. అయితే ఆయన ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
50 జెడ్పీటీసీలకు గాను ఒకరు రాజీనామా చేశారు. మరొకరు చనిపోయారు. దీంతో ఖాళీల సంఖ్య 49. ఎన్నికల అనంతరం టిడిపి గూటికి ఐదుగురు జడ్పిటిసిలు చేరారు. దీంతో టీడీపీ బలం ఆరుకు పెరిగింది. 42 జడ్పిటిసి లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ జడ్పీ పీఠాన్ని గెలుచుకోవడం ఖాయం.
అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సొంత జిల్లాలో మట్టి కరిపించాలని కూటమి భావిస్తోంది. అందుకే మెజారిటీ జడ్పిటిసి లను తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తోంది. దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు జడ్పిటిసిలకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. జడ్పిటిసి లను ప్రత్యేక బస్సుల్లో శిబిరాలకు తరలించింది. ఈనెల 27న నేరుగా జడ్పీ కార్యాలయానికి తీసుకొచ్చేలా వ్యూహం రూపొందించింది.
జగన్మోహన్ రెడ్డి సైతం జిల్లా పరిషత్ విషయంలో ప్రత్యేక ఆలోచన చేశారు. ఇప్పటికే చైర్మన్ గా రామ్ గోవిందరెడ్డి ని ఎంపిక చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది జడ్పిటిసిలు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జడ్పిటిసిలకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు కూటమి ప్రయత్నాలు ఫలించకపోవడంతో తోక ముడిచినట్లు సమాచారం. విలువలు సిద్ధాంతాలు అంటూ ప్రకటనలతో కూటమి పోటీ చేయకపోవచ్చు అనేది ఒక టాక్. అయితే కూటమికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.