జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిల హవా కొనసాగుతుండడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధినేతకు చెబితే సర్దుకుపోవాలని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే టిడిపి ఇన్చార్జులు రెచ్చిపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు జనసేన శాసనసభ్యులు. అధినేత పవన్ కు చెబితే ఏమవుతుందోనని భావించి ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
టిడిపి అనుకూల మీడియాలో సైతం దీనిపై ప్రత్యేక కథనాలు వచ్చాయి. నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయని.. టిడిపి ఇన్చార్జులు డామినేట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు జనసేన ఎమ్మెల్యేలు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. అధినేత దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మొన్నటి ఎన్నికల్లో శతశాతం విజయం సాధించింది జనసేన. 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్నిచోట్ల గెలుపొందింది. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ముగ్గురుకి మంత్రి పదవులు దక్కాయి. మిగతా 18 మంది ఎమ్మెల్యేలు టిడిపి ఇన్చార్జిలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారే షాడో ఎమ్మెల్యేలుగా మారి జనసేన ఎమ్మెల్యేలకు డామినేట్ చేస్తున్నారు. ఇది జనసైనికులకు మింగుడు పడడం లేదు.
పొత్తు అనివార్యం కావడంతో టిడిపి నేతలకు అవకాశం లేకుండా పోయింది. దశాబ్దాలుగా వారు నియోజకవర్గాల్లో పాతుకు పోయారు. అటు టిడిపి నేతలు సైతం ఎప్పటినుంచో రాజకీయాలు చేస్తున్నారు. జనసేన నుంచి గెలిచిన వారంతా కొత్తవారే. పైగా టిడిపి సాయంతో గెలిచిన వారే. రాజకీయాల పట్ల అంతగా అనుభవం లేకపోవడంతో టిడిపి నాయకుల వ్యవహార శైలి వారికి మింగుడు పడని అంశంగా మారిపోయింది.
ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు మంత్రి నాదెండ్ల మనోహర్ కు చెప్పారు. ఆయన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారే అనుకుంటే.. పవన్ చర్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మరో 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగాలి. అది కావాలంటే క్షేత్రస్థాయిలో అందరూ సర్దుబాటు చేసుకోవాలి. ఇదే మాట చెబుతారు కానీ.. ఆయన నోటి నుంచి కొత్త మాట వినిపించదు.
ఒకరిద్దరు తప్ప దాదాపు జనసేన ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గాలు సొంతం కాదు. అది జగమెరిగిన సత్యం కూడా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చాలామందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావు కూడా. అందుకే ఈ నాలుగేళ్లు సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లడమే తప్ప.. జనసేన ఎమ్మెల్యేలకు వేరే ఆప్షన్ లేదు.