ఆ నేత పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా రాజకీయాలు మార్చుతుంటారు. అధికార పార్టీని సేఫ్ జోన్ గా మార్చుకుంటారు. గాలివాటం ప్రదర్శిస్తారు. ఏ పార్టీ అధికారంలో వస్తుందనుకుంటే ఆ పార్టీలో చేరుతారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ? అని తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మనసు మారుతోందని పెద్ద ఎత్తున జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్, టిడిపి, ప్రజారాజ్యం తరపున ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఏకైక నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. రాజకీయ వాతావరణం మార్పును అనుసరించి ఆయన కూడా తనను తాను మార్చుకుంటూ ఉంటారు. సూర్య భగవానుడి నడక అనుసరించి పొద్దుతిరుగుడు పువ్వు తిరుగుతూ ఉంటుందని సంగతి తెలిసిందే. అయితే అది ప్రకృతి ధర్మం కాగా.. ఆరని శ్రీనివాసులకు మాత్రం బతక నేర్చిన రాజకీయం.
తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆరని శ్రీనివాసులు. ఆ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో.. శ్రీనివాసులు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు అయ్యారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు. దక్కక పోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అయినా ఓటమి ఎదురైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నుంచి మూడోసారి బరిలో దిగిన ఆయనకు విజయం దక్కింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు భారీ మెజారిటీ లభించింది.
అయితే చిత్తూరులో ఆయనపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఆయన బదులు మేడ రఘురామిరెడ్డిని పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరని శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచారు ఆరని శ్రీనివాసులు. అయితే గెలిచిన నాటి నుంచి ఆరని శ్రీనివాసులు తీరు భిన్నంగా ఉంటోంది.
తిరుపతి వేదికగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు. తిరుమల లడ్డు వివాద సమయంలో కూడా తన వాయిస్ బలంగా వినిపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. దానిని తిప్పి కొట్టడంలో మాత్రం ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు విఫలమయ్యారు. అయితే ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకే అలా చేసినట్లు తెలుస్తోంది.
గాలివాటం రాజకీయాలు ప్రదర్శించే ఆరని శ్రీనివాసులు భవిష్యత్తును ఆలోచించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడం లేదని ప్రచారంలో ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఆ పార్టీలో చేరేందుకు సైతం ఆరని సిద్ధపడతారని కూడా తెలుస్తోంది.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఒకరుగా భూమున కరుణాకర్ రెడ్డి ఉన్నారు. అనవసరంగా ఆయనపై విమర్శలు చేస్తే వైసీపీలోకి ఎంట్రీ కష్టమవుతుందని ఆరని శ్రీనివాసులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆరని ఈ కొత్త సైలెంట్ మార్గం ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.