Tuesday, April 22, 2025

మాజీ మంత్రి అవంతి రాజకీయ సన్యాసం

- Advertisement -

మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాజకీయ జీవితం ముగిసినట్టేనా? ఆయనకు ఇక చాన్స్ లేనట్టేనా? ఆయన టిడిపిలో ఎంట్రీకి ఆ మాజీ మంత్రి అడ్డుపడ్డారా? అవంతి ఉంటే తన పొలిటికల్ కెరీర్ సవ్యంగా సాగదని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజుల కిందట రాజీనామా చేశారు అవంతి శ్రీనివాసరావు. సైకిల్ ఎక్కుతారని తెగ ప్రచారం నడిచింది. పాత పరిచయాలతో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి తిరుగుతూ కనిపించారు. కానీ పార్టీలోకి మాత్రం ఇంతవరకు ఎంట్రీ లేకుండా పోయింది.

వరుసగా 15 ఏళ్ల పాటు పదవులతో నెట్టుకొచ్చారు అవంతి శ్రీనివాసరావు. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి ఆయన పరిస్థితిని తారుమారు చేసింది. పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడేలా ఉంది. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జనసేనలో చేరికకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. దీంతో రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి అవంతి శ్రీనివాసరావు వచ్చారు.

అవంతి శ్రీనివాసరావు సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ప్రధాన అనుచరుడుగా ఉండేవారు. విద్యాసంస్థల అధినేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ రావు ప్రజారాజ్యం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు తో పాటు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో తొలిసారిగా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో మంత్రి అయ్యారు గంటా శ్రీనివాసరావు. అటు తరువాత 2014లో రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం గూటికి చేరారు గంటా. తనతోపాటు అవంతి శ్రీనివాసరావును సైతం తీసుకెళ్లారు.

అయితే అసెంబ్లీకి ఎన్నికై మంత్రి కావాలన్నది గంటా శ్రీనివాసరావు లక్ష్యం. అందుకే అవంతి శ్రీనివాసరావును భీమిలి నుంచి ఖాళీ చేయించారు. ఆయనకు అనకాపల్లి పార్లమెంట్ స్థానం సీటు ఇప్పించారు. భీమిలి నుంచి పోటీ చేశారు గంటా శ్రీనివాసరావు. 2014 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాసరావును తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. అప్పటివరకు అవంతి, గంటా మద్య సంబంధాలు సవ్యంగా నడిచాయి. కానీ అయిష్టంగానే ఎంపీగా పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాసరావును చెక్ చెప్పాలని భావించారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి హామీ తోనే అవంతి శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి అవంతి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో సబ్బం హరి పై విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అలా గంటా శ్రీనివాసరావు పై రివెంజ్ తీర్చుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లో అవంతి శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన నాటి నుంచి సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టిడిపిలో చేరేందుకు ట్రై చేశారు. కానీ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా గంట శ్రీనివాసరావు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని గంటా భావిస్తున్నారు. అందుకే అవంతికి బ్రేక్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చివరి వరకు ప్రయత్నం చేసిన అవంతి శ్రీనివాసరావు.. రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!