కొందరుకు రాజకీయంగా కలిసి వస్తుంది. అనుకోని అవకాశాలు వచ్చి పడతాయి. రాత్రికి రాత్రే గోల్డెన్ ఛాన్స్ కొట్టేస్తారు. అటువంటి నేతల్లో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఒకరు. సామాన్య నాయకుడిగా ఉన్న ఆయన టిడిపి ఎంపీ టికెట్ దక్కింది. కూటమి ప్రభంజనంలో ఎంపీ అయిపోయారు. అయితే ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా సామాన్య కార్యకర్త మాదిరిగానే వ్యవహరిస్తుండడం మాత్రం టిడిపి వర్గాల్లో ఆశ్చర్యకర చర్చ జరుగుతోంది.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కు ప్రచార యావ ఎక్కువ. పూర్వాశ్రమంలో ఆయన ఈనాడు విలేఖరిగా పనిచేసేవారు. ఆ సమయంలోనే చిన్నచిన్న వ్యాపారాలు చేసి లాభపడ్డారు. అటు తరువాత ప్రతిభా భారతి, తమ్మినేని సీతారాం లాంటి నేతలను పట్టుకొని టిడిపిలో చేరారు. పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు. అటు తర్వాత ప్రజారాజ్యం ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిపోయారు. అటు తర్వాత తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గూటికి వచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం మారింది. కింజరాపు ఎర్రం నాయుడు ప్రభావం ప్రారంభమైంది. క్రమేపి ఆయనకు దగ్గరయ్యారు కలిసేట్టి అప్పలనాయుడు. ఆయన కుటుంబ సభ్యులకు మరింత చేరువయ్యారు. కింజరాపు మనిషి అంటూ ముద్రపడ్డారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి కళా వెంకట్రావు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండగా కింజరాపు మనిషిగా ఆయనకు ప్రత్యర్థిగా నిలిచారు కలిసేట్టి అప్పలనాయుడు.
కింజరాపు కుటుంబ ప్రోత్సాహంతో ఎచ్చెర్లలో లోకల్ నినాదాన్ని తెచ్చారు. కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా ఒక గ్రూపు కట్టడంలో కలిసేట్టి అప్పలనాయుడు సక్సెస్ అయ్యారు. దీంతో కింజరాపు కుటుంబం పావులు కదిపింది. కళా వెంకట్రావును విజయనగరం జిల్లా చీపురుపల్లి కి పంపించగలిగింది.
అయితే కళా వెంకట్రావును పంపించగలిగారు కానీ.. ఎచ్చెర్లను బిజెపికి కేటాయించగలిగారు. కలిసేట్టి అప్పలనాయుడు ను విజయనగరం పార్లమెంట్ స్థానానికి సర్దుబాటు చేయగలిగారు. దీంతో కూటమి ప్రభంజనంతో ఎంపీ కాగలిగారు కలిసెట్టి అప్పలనాయుడు.
ఇప్పటికీ ఒక కార్యకర్త మాదిరిగానే హడావిడి చేస్తున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. సంప్రదాయ వస్త్రధారణ అంటూ ఒకసారి.. సైకిల్ పై మరొకసారి.. ఇలా లేనిపోని హడావిడితో ఢిల్లీలో గడిపేస్తున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్, కేంద్ర పెద్దల దృష్టికి వచ్చేందుకు తెగ ఆరాటపడుతుంటారు. అయితే ఆ ఆరాటం విజయనగరం పార్లమెంట్ స్థానం అభివృద్ధికి దృష్టి పెట్టడం లేదన్న విమర్శ ఉంది. దీనిపై హై కమాండ్ పెద్దలు సైతం కలిశెట్టి తీరుపై ఆగ్రహించినట్లు ప్రచారం సాగుతోంది