R Krishnaiah: బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య జగన్ మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయంగా ఎటువంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్న ఆర్ కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు పంపించారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ వారిని కాదునుకుని కుల ప్రాతిపదికనా ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేశారు జగన్. అయినప్పటికి ఈ కుల సమీకరణాలు ఏమీ కూడా జగన్‌కు కలిసి రాలేదు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో నేతలు ఆ పార్టీని ఒకొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు.
ఈక్రమంలోనే పిలిచి మరి పదవి ఇచ్చిన ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ పదవితో పాటు, పార్టీకి సైతం రాజీనామా చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆయనపై మండిపడుతున్నారు. కృష్ణయ్యపై జగన్ ఎంతో నమ్మకం ఉంచి ఎంపీ పదవి ఇస్తే దానిని వదులుకుని వైసీపీకి వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆర్ కృష్ణయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువలు లేని వారికి పదవులు కట్టబెడితే ఇలానే ఉంటుందని ఆర్ కృష్ణయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆర్ కృష్ణయ్య స్పందించారు.
తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆర్ కృష్ణయ్య తెలిపారు.తనకు పదవులు కన్నా బీసీ సంక్షేమమే ముఖ్యమని తేల్చేశారాయన. రాజ్యసభ సభ్యుడుగా కొనసాగడం వల్ల బీసీ సంక్షేమానికి పాటు పడలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. నేను రాజ్యసభలో ఉండటం వల్ల బీసీలకు ఉపయోగం ఉండటం లేదని, దీని కారణంగానే వైసీపీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. తాను రాజ్యసభలో ఉండడం వల్ల నష్టమే ఎక్కువ ఉందని, బీసీ ఉద్యమమే ఆగిపోయిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవి ఎందుకు అనిపించి రాజీనామా చేశానని చెప్పారు.
ఈ సమయంలోనే ఆయన జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద కానీ, ఆయన పార్టీ మీద కానీ నాకు ఎటువంటి ద్వేషం లేదని,జగన్ మీద అభిమానం ఈ రోజుకీ అలానే ఉందని ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. జగన్ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ఆర్. కృష్ణయ్య చెప్పుకొచ్చారు.బీసీల కోసం జగన్ ఎంతో చేశారని అన్నారు. ఆయన బీసీల కోసం ఎన్నో పధకాలను కూడా ప్రవేశపెట్టారని కూడా కొనియాడారు. బీసీలకు అధికారం కట్టబెట్టిన ఘనత కచ్చితంగా జగన్‌కే దక్కుతుందని ఆయన వ్యాఖ్యనించారు.
జగన్‌కు ఎప్పుడు నష్టం చేకూర్చాలని అనుకోలేదని, నా రాజీనామా వల్ల ఆ పదవి టీడీపీకి వెళ్తుందనే లెక్కలు తాను వేసుకోలేదని ఆర్. కృష్ణయ్య తెలిపారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఉన్నప్పుడు బీసీ సంక్షేమం గుర్తుకు రాలేదా అంటూ వైసీపీ శ్రేణులు ఆర్. కృష్ణయ్యను ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసమే ఆయన వైసీపీకి రాజీనామా చేశారని, త్వరలోనే ఈ తత్వం అందరికి బోధపడుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది