ఎట్టకేలకు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిలో పరివర్తన కనిపిస్తోంది. గత ఐదేళ్లలో వైసిపి కార్యకర్తలను పట్టించుకోలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఇకనుంచి అటువంటి పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. తనకు అన్ని విషయాలు తెలిసాయని.. ఇకనుంచి తప్పులు జరగవని చెప్పుకొస్తున్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో తనపై నమ్మకం పెట్టుకున్న వైసీపీ శ్రేణులను పట్టించుకోలేదన్న నిజాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఇక మీదట అలా జరగదని.. తనలో మార్పు చూస్తారని పార్టీ శ్రేణులకు సూచించారు జగన్మోహన్ రెడ్డి. అయితే అతి చిన్న వయసులో ఈ రాష్ట్రానికి సీఎంగా అయిన వ్యక్తి.. సంక్షేమం అనే పదానికి నిజమైన అర్థం చెప్పిన వ్యక్తి.. పార్టీ శ్రేణుల్లో విషయంలో జరిగిన తప్పిదాన్ని స్వయంగా ఒప్పుకోవడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. ప్రజల బాగోగులు పట్టించుకునే క్రమంలో కార్యకర్తలను విస్మరించారని ఒక పార్టీ అధినేత నేరుగా ప్రకటన ఇవ్వడం ఇదే తొలిసారి. దటీజ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ తన సొంత పార్టీ శ్రేణుల కోసం పాకులాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. తండ్రిని చూసి తనకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టారని ఆయనకు తెలుసు. అందుకే తండ్రికి మించి సంక్షేమాన్ని అమలుచేసి ప్రజల్లో బలమైన ముద్ర చాటుకున్నారు. సంక్షేమానికి ఆధ్యుడిగా నిలిచారు. అయితే తాను ఒకటి తలిస్తే ప్రజలు ఒకటి తలిచారు అన్నట్టు ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురయ్యింది. అయితే ప్రజలకు మంచి చేసే క్రమంలో ఆయన సొంత పార్టీ శ్రేణులకు దూరమయ్యారు. అదే విషయాన్ని తాజాగా గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు మంచి చేసే క్రమంలో మిమ్మల్ని మరిచిపోయానని.. అందుకు తనను క్షమించాలని కోరారు. తనకు పార్టీ కంటే.. పార్టీ కార్యకర్తల కంటే.. ప్రజా సంక్షేమమే ప్రధమ కర్తవ్యం అని పరోక్ష సంకేతాలు పంపారు జగన్మోహన్ రెడ్డి.
అయితే ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా.. రాజకీయాలే చేయాలి. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి మరిచిపోయారు. ప్రజలకు మంచి చేస్తే.. తనను గుర్తిస్తారని భావించారు. తనను గెలిపించిన కార్యకర్తల కంటే ప్రజలకే విలువ ఇచ్చారు. కానీ అదే ప్రజలు తనను ప్రతిపక్షానికి కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అగౌరవపరిచారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల సానుభూతి తగ్గించలేదు. కానీ ప్రజలకు మంచి చేయాలన్న కోణంలో కార్యకర్తలకు అన్యాయం చేశానన్న బాధ ఆయన నుంచి వ్యక్తం అవుతోంది. అదే బాధను బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి. మరోసారి తాను అధికారంలోకి వస్తే ప్రజలతో పాటు సమానంగా పార్టీ కార్యకర్తలకు చూసుకుంటానని హామీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
అయితే ఇప్పుడు ప్రజలను అన్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. ఈ క్రమంలో తన, తమ అన్న బేధాలు చూసుకోలేదు. లాభనష్టాలు బేరిజు వేసుకోలేదు. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి సంక్షేమ ఫలాలను అందించగలిగారు జగన్మోహన్ రెడ్డి. కానీ రాజకీయాలు అన్నాక సొంత పార్టీ నేతలు ఉంటారు. తనను నమ్మిన కార్యకర్తలు ఉంటారు. కానీ ఈ విషయాన్ని మరిచి వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయనకు తత్వం బోధపడింది.
ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. తనకు ఎదురైన అపజయాన్ని గుణపాఠంగా మార్చుకున్నారు. ఏ రాజకీయ పార్టీ కైనా కావాల్సింది కార్యకర్తలేనని.. ప్రజలను నమ్ముకుంటే నట్టేట ముగిస్తారు అన్నది ఫలితంగా తెలుసుకున్నారు. అందుకే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి 1.0ని మాత్రమే చూశారని.. ఇకనుంచి జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారని తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రకటన వెనుక నిగూడార్థం ఉంది. ప్రజలను నమ్ముకుంటే తనను నట్టేట ముంచారని… అదే క్యాడర్ను నమ్ముకుంటే గెలిపించే వారన్న విషయాన్ని గ్రహించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే సినిమా పాయింట్ తో లాజిక్ చెప్పారు. మున్ముందు వైసీపీ శ్రేణులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తద్వారా 40% ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ గెలుపును సజీవంగా నిలపగలిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.