రామ్ గోపాల్ వర్మ.. ప్రతిభావంతమైన దర్శకుల్లో ఒకరు. కానీ ఆయనపై వివాదాస్పద ముద్ర వేశారు. రాజకీయాలు ఆపాదించారు. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి కూడా అలానే ఉంటుంది. గత కొద్దిరోజులుగా రామ్ గోపాల్ వర్మపై ఏపీలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్జీవిని అరెస్టు చేయవద్దని కోర్టు సైతం ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో ఆయన పోలీస్ విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఇచ్చిన నోటీసుకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు.
ఆది నుంచి రాంగోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి మద్దతు దారుడుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా అభిమానించే వారిలో రాంగోపాల్ వర్మ ఒకరు. అందుకే గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని సిద్ధం, వ్యూహం సినిమాలను రూపొందించారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాంగోపాల్ వర్మ చంద్రబాబు కుటుంబం పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా కు చెందిన టిడిపి నేత రామలింగం పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. అటు తరువాత రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదులు చేశారు. కొద్దిరోజుల పాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మను అరెస్టు చేయవద్దు అంటూ కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలోనే ఆయన ఈ కేసు విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. నిన్ననే ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట వర్మ హాజరయ్యారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.
ప్రకాశం జిల్లాకు వచ్చిన రామ్ గోపాల్ వర్మను స్థానిక వైసీపీ నేతలు కలిశారు. కీలక చర్చలు జరిపారు. ఓ హోటల్లో వర్మతో వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రామ్ గోపాల్ వర్మను కలిసినట్లు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో సైతం సత్తా చాటారు. అటువంటి దర్శకుడుని రాజకీయంగా టార్గెట్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కేవలం రాజకీయ కక్షతోనే రామ్ గోపాల్ వర్మను కూటమి ప్రభుత్వం వెంటాడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే రాంగోపాల్ వర్మ కు అన్ని విధాల అండగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక విధానాన్ని ఫాలో అవుతున్నారు. తనకు అండగా ఉన్నవారు ఇబ్బందుల్లో ఉంటే స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మకు అండగా నిలబడతానని సంకేతాలు పంపించారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి విషయంలో రామ్ గోపాల్ వర్మ సానుకూలంగా ఉన్నారు. ఆయన రాజకీయ వైఖరిని ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేసుకుంది. అయితే తన వల్ల రాంగోపాల్ వర్మ ఇబ్బంది పడ్డారని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు అండగా నిలబడుతుండడం విశేషం. నిన్న వర్మతో సమావేశం అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు సమాచారం.