Friday, April 19, 2024

భారత్ సెమీస్ చేరడం కష్టమే..కపిల్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

టీ ట్వంటీ ప్రపంచకప్‌ కోసం భారత అభిమానుల నిరీక్షణకు 15 ఏళ్ళు దాటిపోతోంది. పొట్టి క్రికెట్‌లో 2007లో విజేతగా నిలిచిన తర్వాత వరల్డ్ కప్ మళ్ళీ టీమిండియా గెలవలేకపోయింది. ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ, ఐపీఎల్‌లోనూ రాణిస్తున్న మన క్రికెటర్లు ఈ మెగా టోర్నీలో మాత్రం నిరాశపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే భారత్‌ అవకాశాలపై మాత్రం మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ పెదవి విరిచాడు. రోహిత్ సేన సెమీస్ చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాడు. ప్రపంచకప్‌లో భారత్ విజయావకాశాలపై తన అభిప్రాయాలు పంచుకున్న ఈ లెజెండ్ మన జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టే అవకాశాలు కేవలం 30 శాతమే ఉన్నాయన్నాడు. టీ20 క్రికెట్‌లో ఒక మ్యాచ్ గెలిచే టీమ్‌ తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవచ్చనీ, ఇండియా వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాల గురించి మాట్లాడటం చాలా కష్టమన్నాడు.

జట్టులో కీలక ఆటగాళ్ళపై మాట్లాడిన కపిల్ భారత్‌కు 30 శాతం మాత్రమే అవకాశం ఉందన్న దానికి కారణమేంటో చెప్పలేదు. మరోవైపు ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాపై మాత్రం కపిల్ ప్రశంసలు కురిపించాడు. పాండ్యా జట్టుకు కీలకం కానున్నాడని జోస్యం చెప్పాడు. టోర్నీలు గెలిపించే ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉంటే అంతకన్నా కావాల్సిందేముందని వ్యాఖ్యానించాడు. తుది జట్టులో ఆరో బౌలర్‌ను తీసుకునే స్వేచ్ఛను హార్దిక్‌లాంటి ప్లేయర్స్ కెప్టెన్ రోహిత్‌కు ఇస్తారన్నాడు. అయితే ప్రస్తుత తరంలో ఆల్‌రౌండర్ల కొరత జట్టును వేధిస్తోందని కపిల్ అభిప్రాయపడ్డాడు. తాము ఆడే రోజుల్లో ఎంతోమంది ఆల్‌రౌండర్లు ఉండేవాళ్లని గుర్తు చేశాడు. ప్రస్తుత యువ క్రికెటర్లు కొత్త ప్రమాణాలను నెలకొల్పడం మంచిదేననీ, వారు మరింత కఠినంగా శ్రమించాలని కపిల్‌ సూచించాడు.

ఇక భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉందన్న కపిల్‌దేవ్ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్‌గా అభివర్ణించాడు. సూర్యకుమార్‌ ఇంతగా ప్రభావం చూపుతాడని ఎవరూ ఊహించలేదనీ, అయితే బ్యాటింగ్‌లో ఎంతో గొప్పగా రాణించి ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడని కపిల్ ప్రశంసించాడు. సూర్య లేని భారత టీమ్‌ను ఊహించలేమనీ, విరాట్‌, రోహిత్‌, రాహుల్‌లాంటి వాళ్లతో కలిసి సూర్య ఆడుతుంటే ఏ టీమ్‌నైనా బలంగా మారుస్తుందని కపిల్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!