YSRCP:ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీకి మరో బిగ్ షాక్ తగలనుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి కొందరు ప్రముఖ నేతలు వలసల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. రేపు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఉదయభాను.. ఈ నెల 22న జనసేనలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లను నిజం చేస్తూ ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఉదయభాను సంప్రదింపులు జరిపారని సమాచారం.
ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలస బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో సీనియర్ నేత ఉదయభాను కూడా చేరినట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, సామినేని ఉదయభాను 2019లో వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి కీలక పాత్ర పోషించిన ఉదయభాను.. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేశారు. అలాంటి ఒక ప్రముఖ నేత ఇప్పుడు వైసీపీని వీడుతున్నాడనే ప్రచారం ఊపందుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.