YS Jagan: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని రకాల పరిశ్రమలను ప్రోత్సహించారు. వివిధ పరిశ్రమల అభివృద్ధికి తనదైన శైలిలో మెరుగులు దిద్దుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా నిరంతర కృషి చేశారు. ఆ కృషికి ఫలితంగానే ఆక్వా రంగం అప్పుడూ ఇప్పుడూ ప్రగతిపథంలో నిలబడుతోంది. జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఏపీ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో రికార్డులు తిరగరాస్తోంది. జగన్ హయాంలో విస్తీర్ణం, దిగుబడులతో పాటు ఎగుమతుల్లోనూ ఏపీ అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో మూడొంతులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళ్తున్నాయని చెప్పడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఆక్వా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇటీవలే కేంద్రం మెచ్చుకోవడం విశేషం. రాష్ట్రంలో ఆక్వా రంగంలో మరింత అభివృద్ధి కోసం అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, నీతి ఆయోగ్ సీఈవో పీవీఆర్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ జాతీయ సలహాదారు నీలం పటేల్ స్పష్టం చేశారు.