Sunday, October 13, 2024

Telangana: తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు.. రేవంత్ సర్కారుపై ఆర్యవైశ్యులు, సెటిలర్స్ గుర్రు

- Advertisement -

Telangana: సీఎం రేవంత్ తేనె తుట్టను కదిపారా? అనవసర విషయాల్లో వేలిపెడుతున్నారా? సవ్యంగా సాగుతున్న పాలనలో తన మార్కు చూపించాలని భావిస్తున్నారా? హైడ్రాతో ఇప్పటికే రాష్ట్ర ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పేర్ల మార్పు వివాదానికి తెరతీశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ల మార్పు మినహా పెద్దగా పరిపాలన నిర్ణయాలు చేయని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజముద్ర, రాష్ట్ర గేయం, పేర్ల మార్పు వంటి వాటితో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పొందుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రేవంత్‌ సర్కార్‌ తీసుకున్న మరో నిర్ణయం అగ్గి రాజేస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపుపై ఆర్య వైశ్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై వారు మండిపడుతున్నారు. పేరు మార్పుపై నిరసనకు దిగే అవకాశం ఉంది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డిగా పేరు మార్చడంపై ఆర్యవైశ్య సంఘాలు భగ్గుమన్నాయి. పరోక్షంగా అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల నేతలు ఆక్షేపిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్‌ సర్కార్‌పై ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని ఆర్యవైశ్య ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య కార్యాలయంలో సమావేశం కానున్నారు.భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి తొలగించడం అమానుషంగా ఆర్యవైశ్య సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయంపై అన్ని జిల్లాలు, మండలాల నుంచి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా చర్యలు తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు.

అయితే పొట్టి శ్రీరాముల పేరు మార్పు విషయంలో సర్కారు పునరాలోచించుకోవాలన్న విన్నపాలు వస్తున్నాయి. తెలుగు జాతి ఐక్యత కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలుగు జాతికి తెలియజేయాలని ఆర్యవైశ్య సంఘాలు కోరాయి. అంతే కానీ శ్రీరాములు పేరు తొలగించడం లాంటివి సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యను ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఆర్యవైశ్యులందరూ పార్టీలకతీతంగా ఒకతాటి పైకి వచ్చి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.దీంతో ఇప్పుడు ఉన్నవి చాలవన్నట్టు కొత్త వివాదం కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. ఈ విషయంలో సీఎం రేవంత్ దూకుడును సొంత పార్టీ శ్రేణులే తప్పుపడుతున్నాయి. విపక్షాలకు సైతం అవకాశం ఇచ్చినట్టు అయ్యింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చాలని భావించారు. అయితే పేర్ల జోలికి వెళ్తే కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని భావించి వెనక్కి తగ్గారు. ముఖ్యమంత్రిగా పదేళ్లు ఉన్న కేసీఆర్‌ ఏనాడూ పేర్ల మార్పు జోలికి వెళ్లలేదు. ఆంధ్రవారి పేర్ల వివాదానికి వెళ్లకుండా పదేళ్లు ప్రశాంతంగా పాలించాలి. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ‘ఆంధ్రవారి పేర్లు’ అనే తేనేతుట్టను కదిలించారు. దీంతో వివాదం రాజుకుంది. మరి పేరు మార్పుపై ఆర్యవైశ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.అయితే తప్పకుండా ఇది పార్టీకి ఇబ్బందికరమేనని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పై ప్రాంతీయ వాదం ముద్ర వేసేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్. పాడె కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఎపిసోడ్ లో ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ తెలుగు జాతి ఐక్యతకు క్రుషిచేసిన మహనీయుడు పేరు తొలగించడంతో ఢిఫెన్స్ లో పడిపోయింది. దీనిపై ముప్పేట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా ఇబ్బందులు తెచ్చి పెడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం భయపడుతున్నాయి. ముఖ్యంగా సెటిలర్స్ నుంచి వ్యతిరేకత ఖాయమని అంచనాకు వస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!