Balineni Srinivas reddy: మొత్తానికి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఇవాళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువై ఉండి పార్టీ కష్ట కాలంలో మరింత నష్టాన్ని కలిగించేలా బాలినేని వ్యవహరించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. తనను మంత్రి పదవి నుండి తొలగించినప్పటి నుండి జగన్‌పై అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన వైఖరితో ఆ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకి తీవ్రమైన విసుగు తెప్పించారు. ప్రతి రెండు, మూడు వారాలకు ఒకసారి వైసీపీని వీడుతున్నట్లు లీకులు ఇవ్వడం తర్వాత సైలెంట్ అవ్వడం ఆయనకు అలవాటైందని ఆ పార్టీ నాయకులు చర్చించుకునేవారు. గత వారంలో కూడా వైఎస్ జగన్‌ను తాడేపల్లిలో బాలినేని కలిసిన సమావేశం అసంతృప్తిగా ముగిసినట్లు వార్తలు వచ్చాయి.
వైసీపీలో బాలినేని కీలక నాయకుడుగా పని చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బాలినేని అప్పటి నుంచి అధినేతపై సన్నిహితుల వద్ద విమర్శలు చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే బాలినేని పార్టీ వీడతారనే ప్రచారం జరిగినా ఎన్నికల అనంతరం పార్టీ వీడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బంధం తెంచుకోడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక విభేదాలే కారణమని పార్టీ వర్గాల సమాచారం. విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి బాలినేనికి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అయితే ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు ఇవ్వకపోవడం కొంత పెండింగ్లో ఉండడం తనకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బాలినేని అడగట౦ రెండేళ్లుగా సాగుతోందని వారు తెలిపారు. ప్రభుత్వం లేదని కొంత ఓపిక వహించాలని జగన్ చెబుతూ వస్తున్నారని సమాచారం. పైగా సదరు కంపెనీ పనుల్ని కూటమి ప్రభుత్వం నిలిపేసిందని బాలినేని దృష్టికి జగన్ తీసుకెళ్లారని వారు అన్నారు.
ఈ నేపథ్యంలో తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని ఏదో ఒకటి చేయాలని లేదంటే పార్టీని వీడుతానని బాలినేని బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారని కొందరు వైసీపీ నేతలు తెలిపారు. ఇక వైసీపీలో ఉండలేనని జగన్‌కు చెప్పిన బాలినేని చివరికి పార్టీతోనూ బంధువైన జగన్‌తోనూ బంధాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ మాట్లాడుతూ బాలినేని చాలా నిజాయితీ పరుడని చాలా సార్లు ఆయన గురించి గొప్పగా చెప్పిన విషయం గమనార్హం. కానీ బాలినేనిని తమ పార్టీలో చేర్చుకోవాలంటే ఈవీఎం ల అవకతవకల గురించి తాను పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ బాలినేనిని కోరినట్లు సమాచారం. దీంతో అనవసరంగా జగన్ ని వదిలేశానని బాలినేని తల పట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.