YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ ప్రస్తుతం వైసీపీలో జోష్ నింపుతోంది. జగన్ ఎక్కడికెళ్లినా జనమే జనం. గుంటూరు జైల్లో నందిగం సురేష్‌ను పరామర్శించడానికి ఆయన గుంటూరు జైలుకు వెళ్లగా జనం పోటెత్తారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడ్డా పిఠాపురం వెళ్లినా అదే ఆదరణ. మూడు నెలల క్రితం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్‌కు భారీ స్థాయిలో ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం టీడీపీలో అసహనం పెంచుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
వైఎస్ జగన్ మాస్ లీడర్. ముఖ్యమంత్రి కాక ముందు ఆయన ఎప్పుడూ జనంలోనే ఉండేవారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి నిత్యం ప్రజల మధ్యే గడిపారు. తానున్నాననే భరోసా ప్రజలకి కల్పించారు. అయితే సీఎం అయిన తర్వాత తాడేపల్లి నివాసం నుంచి బయటికి రాకపోవడంతో జనానికి కాస్త కోపం వచ్చిన మాట వాస్తవమే. కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే సభలకు హాజరయ్యే వారని ప్రజలు ఆయన పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నానని ఇక వారిని నేరుగా కలవాల్సిన అవసరం లేదనే భ్రమలో ఆయన ఉండిపోయారు.
తానొక మాస్ లీడర్ అనే సంగతిని జగన్ మరిచిపోయారు. కేవలం సంక్షేమ పథకాల్ని నిబద్ధతతో అమలు చేస్తే సరిపోదని పరిపాలన అంటే ఇతరత్రా అంశాలు ఉంటాయని ఆయన విస్మరించారు. ఎన్నికల్లో అందుకు తగ్గట్టుగానే భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఓటమి తర్వాత ఆయనకు ఈ తత్వం బోధపడింది. ఆయనకు ఓటమి పాఠాలు చెప్పింది. అందుకే ఆయన చేసిన తప్పులు ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలే తనకు ముఖ్యమని వారి సంక్షేమమే తన ప్రాధాన్యతని ప్రజలకి ఆయన తెలియజేయాలని అనుకుంటున్నారు. దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా జనంలోకి వెళ్లడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయవాడలో వరద బాధితుల్ని పరామర్శించడానికి రెండుసార్లు వెళ్లారు. వరద బాధితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగన్ తో ప్రజలు సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. జగన్ నెల్లూరు వెళ్లినా అదే ఆదరణ. ఎటు చూసిన భారీ జన సందోహం ఆయనకు ఘన స్వాగతం పలుకుతోంది.
జగన్‌కు లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు మరియు కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. ఓడిపోయామే తప్ప జగన్‌కు మళ్లీ ఆదరణ లభిస్తోందన్న భరోసా వైసీపీ శ్రేణుల్లో కలిగింది. మళ్లీ మనదే ప్రభుత్వం అనే ధీమా రోజురోజుకూ పెరుగుతోంది. ఇంతకంటే నైతిక స్థైర్యం ఏం కావాలని పార్టీ శ్రేణులంతా చాలా సంతోషంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఓటమి బాధలో ఉన్న తమకు ఈ అంశం చాలా ఊరట కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ప్రజల్లో జగన్ కి లభిస్తున్న ఆదరణ చూసి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తున్నారట.