Tirumala: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. జగన్ తిరుమలకు వెళ్లే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన తిరుమలకు వెళ్లనున్న జగన్ 28వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు. లడ్డూ వివాదం వేళ జగన్ డిక్లరేషన్ పైన చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తమ పైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ చెబుతున్నారు. దీంతో 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే జగన్ అన్యమతస్థుడని శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో సహా ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ వివాదం పైన స్పందించిన సమయంలోనే చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
గతంలో జగన్ తిరుమల దర్శనం కు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే పలు మార్లు జగన్ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని కాబట్టి డిక్లరేషన్ ఇప్పుడు అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ టీడీపీ మరియు బీజేపీ నేతలు జగన్ తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకొని మాత్రమే అనుమతించాలని టీటీడీ అధికారులను కోరుతున్నారు. దీంతో జగన్ డిక్లరేషన్ వ్యవహారం పైన వివాదం కొనసాగుతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ సైతం తాజా ప్రెస్ మీట్ లో ఇదే డిమాండ్ చేసారు. ఇదే సమయంలో మరో అంశం తెర మీదకు వచ్చింది.
ఇప్పుడు ఈ డిమాండ్ వేళ జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. దీంతో జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే అంశం ప్రస్తుతం రాజకీయంగా ఉత్కంఠను రేపుతోంది. 2012 లో జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు జగన్ ను డిక్లరేషన్ పైన సంతకం కోరారు. కాగా తాను 2009లోనే డిక్లరేషన్ ఇచ్చానని జగన్ చెప్పినట్లు ఆ సమయంలో ఈవోగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం చెప్పినట్లు వచ్చిన వార్త క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ప్రతీ సారీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా ఆ వార్త సారాంశం. అదే నిజమైతే ఇప్పుడు మళ్ళీ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కావాలనే జగన్ తిరుమల వెళ్ళకుండా అడ్డుకోవడానికే కూటమి ప్రభుత్వ నాయకులు అడ్డుపడుతున్నారని వైసీపీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ని తిరుమలలో అడుగు పెట్టకుండా అడ్డుకునేవారికి ఇది పెద్ద షాకని వారు అభిప్రాయ పడ్డారు.