Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ పైన రగడ కొనసాగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం, ల్యాబ్ రిపోర్ట్ లతో వైసీపీ పైన దాడి చేసే దాకా వెళ్ళింది. ఏకంగా జగన్ ఇంటి వద్ద బిజెపి ఆందోళనల పర్వం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏకంగా తిరుమల శ్రీవారిని అడ్డు పెట్టుకున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు పైన మండిపడిన మాజీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా వెనకాడడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఈరోజు దేవుడితో ఆటలాడుతున్నాడని లడ్డు తయారీలో ఎటువంటి కల్తీ నెయ్యి వాడలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. కావాలని జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం కోసమే చంద్రబాబు ఈ డ్రామాకు తెర తీశారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీ వందల ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ అని, చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే తనపై నింద రాకుండా జగన్ పైన నింద వేస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వలన తిరుమల గోవిందుడి కి కూడా కళంకం వచ్చిందని లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనుకాడడు అంటూ పేర్కొన్న ఆమె చంద్రబాబుకు నిలువెల్లా విషమే ఉందని విమర్శలు గుప్పించారు. మరో వైపు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చంద్రబాబు పైన మాటల తూటాలను పేలుస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబు ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తిరుమల శ్రీవారి లడ్డూల వ్యవహారాన్ని తెచ్చారని వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. జగన్ పైన ఇటువంటి ఆరోపణలు చేసి రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు ఈ విధంగా కుట్రలకు పాల్పడ్డారని చంద్రబాబు పైన వైసిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని సహించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. లడ్డూ డ్రామా విషయం లో చంద్రబాబు ప్లాన్ ఏంటో మొత్తం లీక్ అయిందని ఇక ఆయన సంగతి ప్రజలు మరియు ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని వారు వ్యాఖ్యానించారు