Ys Jagan: వైసీపీ అధినేత జగన్ నేడు గుంటూరు జైలుకు వెళ్లనున్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జగన్ పరామర్శించే నిమిత్తం గుంటూరు జైలుకు వస్తున్నారు. గతంలో నెల్లూరు వెళ్లి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టారన్న వివాదంలో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని కూడా జగన్ ఈ మధ్య ములాఖత్ ద్వారా పరామర్శించారు. అయితే.. ఇదంతా చూస్తుంటే టీడీపీ కూటమి అధికార దాహంతో వరుసబెట్టి వైసీపీ నేతల అరెస్టులకు పాల్పడినట్లు అర్థమవుతోంది. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను జైలు గోడల మధ్య బంధించే ప్రయత్నం చేసింది. పాత కేసులను తిరగతోడుతూ వైసీపీ నేతలపై అర్థం లేని కేసులు పెడుతూ టీడీపీ కూటమి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా కొందరు వైసీపీ నేతలు అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇదంతా ఇలా ఉండగా.. టీడీపీ చేసిందంతా చేసి ఒకవైపు బెజవాడ ముంపుకు గురైతే పరామర్శించాల్సిన వైసీపీ అధినాయకత్వం.. ములాఖత్ ద్వారా ఏ రకమైన సంకేతాలను ప్రజలకు అందిస్తుందని ఎద్దేవా చేయడం సమంజసం కాదు. అధికార పార్టీలో ఉండి ప్రజా రక్షణకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం వైసీపీపై మాటల దాడికి దిగడం సరికాదు. పార్టీకి అండగా నిలిచి, పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, ముఖ్య నేతలు తప్పుడు కేసుల కారణంగా జైలులో ఉంటే వారి కోసం అధినేత జగన్ వెళ్లడం తప్పేంటి అని వైసీపీ శ్రేణులు సమాధానం ఇస్తున్నాయి. ఏది ఏమైనా ఈ క్రమంలో ఈ రోజు నందిగం సురేష్‌ని పరామర్శించిన అనంతరం జగన్ ఏ విధంగా స్పందిస్తారో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.