YS Jagan: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథాన ముందుకు సాగింది. జగన్ అండ చూసుకుని పదవులు అనుభవించిన బడా నేతలు.. ఇప్పుడు జగన్ అంటే మొహం చాటేస్తున్నారు. ఇలాంటి మూర్ఖపు రాజకీయాలు తెలియని వైసీపీ అధినేత మాత్రం తనవారు ఎవరో.. పరాయివారు ఎవరో గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అందలం ఎక్కించి పెద్దల సభకు పంపించి గౌరవించిన వారు సైతం ప్రస్తుతం ఈజీగా వైసీపీ జెండా పీకేస్తున్నారు అందరికీ సమానంగా ఆదరణ చూపించి వెన్నంటే ఉండి నడిపించినప్పటికీ అధికారం లేదన్న ఒక్క కారణంతో వైసీపీని వీడి వలస బాట పట్టారు. ఆయన పక్కనే ఉంటూ కూడా అవకాశం బట్టి జంప్ చేస్తున్నారు. వెళ్తూ వెళ్తూ జగన్ మీద నిందలు కూడా వేస్తున్నారు. మరి అలాంటి వలస పక్షులకు ఇన్నేళ్ల పాటు నచ్చిన జగన్.. ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు చెడ్డవాడు అయిపోయాడో తెలియని స్థితిలో ప్రస్తుతం వైసీపీ ఉంది.
అధినేత జగన్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నారని.. పార్టీ స్థాపించినప్పటి నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన అసలు మారిందే లేదనేది సన్నిహితులు చెబుతున్న మాట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే విధేయులుగా ఉన్నవారు సైతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పుకోవడం ఇక్కడ గమనార్హం. ఈ పూర్తి వ్యవహారంలో మరి జగన్ చేసిన తప్పు ఏంటనే చర్చ ఇప్పుడు తెర మీదికి వస్తోంది. వైసీపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదిలేసి వెళ్లిపోయారు. ఆ ముగ్గురిని చంద్రబాబు కొనేసాడు అని ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ స్వయం కృతాపరాధామా లేక రాజకీయమే అలా ఉంటుందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇందులో జగన్ తప్పు కూడా ఉందనేది మరో వాదన. పోయేవారు పోతే పోనీయ్ అన్నట్లుగా పార్టీ దృష్టి సారించకపోవడం, బలం ఉన్న నేతలను కాపాడుకోలేక పోవడం కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్న ఫిర్యాదు కూడా ఉంది. ఏది ఏమైనా.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అసహనం చూస్తుంటే.. మళ్లీ ఎన్నికలు వస్తే జగన్ వైపే అధికారం మళ్లుతుందని, మంచి రోజులు మళ్లీ వస్తాయని వైసీపీ ఆశావహులు అంటున్న మాట.