BRS- Congress: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం హాట్ టాపిక్ గా మారింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తోంది. దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీ నియామకం తరువాత అలజడి ప్రారంభమైంది. అయితే అధికార పార్టీ మాత్రం అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరలేదని చెప్తోంది. ఆయన బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు..స్పీకర్ ప్రకటించిన జాబితాలో కూడా బీఆర్‌ఎస్ అని ఉందంటూ సమర్థించుకుంది. దీని విషయంలో కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంతో పాటు ప్రత్యక్ష దాడుల దాకా వెళ్లింది.ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి అరికెపూడి గాంధీతో పాటు పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీతో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, డాక్టర్ సంజయ్‌కుమార్, ప్రకాష్ గౌడ్‌లు అటెండ్ అయ్యారు. ఈ ఇష్యూపై బీఆర్‌ఎస్ మరోసారి గళమెత్తుతోంది. కాంగ్రెస్‌లో చేరలేదని శాససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన కామెంట్స్ అబద్ధాలు అంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.దీంతో బీఆర్‌ఎస్ మరోసారి ఫైర్ అవుతోంది.
దీనికి మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. సీఎం తన నియోజకవర్గానికి వచ్చినందుకే..అరికెపూడి గాంధీ వచ్చి కలిశారే తప్ప.. సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదన్నారు. మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ సమావేశానికి రాలేదని.. కేవలం సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారని చెప్పుకొచ్చారు. సిద్ధిపేట నియోజకవర్గానికి సీఎం వెళ్తే.. కార్యక్రమంలో హరీష్‌రావు పాల్గొనరా అంటూ శ్రీధర్‌బాబు ఎదురు ప్రశ్నించారు.అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా ఫిరాయింపుల అంశం కుతకుతలాడుతోంది. గాంధీభవన్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాల్లో వివాదం రాజుకుంటోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. గాంధీభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశాలకు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశానికి కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా సమావేశానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
అయితే కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా సమావేశం మాత్రం కాస్త రసాభాసా జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్ల జాబితాలో పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు పొందుపరచలేదు. అదే సమయంలో పార్టీ ఫిరాయించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేరును ప్రస్తావించారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీ పెద్దల తీరుపై గరం అయ్యారు. జరిగిన తప్పును గ్రహించిన పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. ఏదో పొరపాటు వల్ల పేరు పడలేదని..జరిగిన దానికి సారీ చెప్పి.. మరోసారి ఇలాంటి తప్పిదం జరగదని సర్దిచెప్పారు. శనివారం గాంధీభవన్ జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశానికి జీవన్ రెడ్డి డుమ్మా కొట్టారు.
ఇలా పార్టీ ఫిరాయింపుల అంశం హస్తం పార్టీలో ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. బీఆర్ఎస్ మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత కోసం గట్టి ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉంది. గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు..సీఎల్పీ భేటీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరైన ఎవిడెన్స్‌ను సేకరించి కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలని చూస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు టెక్నికల్ అంశాలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. డైలీ ఎపిసోడ్‌లా కొనసాగుతున్న ఈ ఇష్యూ ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అయితే ఫైనల్‌గా ఎవరు పైచేయి సాధిస్తారనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అయితే మున్ముందు ఈ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.