YSRCP: గత ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్సార్సీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. ప్రజల అండదండలతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు కీలక పదవుల భర్తీ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు, కొందరు బడా నేతలే వైసీపీని వీడి వెళుతుండడం ఆలోచించాల్సిన విషయమే. వైసీపీ అధికారం వీడి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే వైసీపీ ప్రతిష్ట దిగజార్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పన్నని వ్యూహం లేదు. రాష్ట్రంలో నెలకొంటున్న అన్ని పరిస్థితులను, ఎదుర్కొంటున్న సమస్యలను వైసీపీపైకి నెట్టేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగమే శ్వేతపత్రాల విడుదల, శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.
ఇలాంటి తరుణంలో ఒంటరైన వైసీపీ ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అదే సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటీ లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే ఎలాంటి జంకు లేకుండా ప్రజల అభిమానాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో కామ్రేడ్స్ మాత్రమే వైసీపీకి కొంత ఊరట ఇచ్చేలా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సీపీఎం కూటమి నేతలపై బాహాటంగానే విమర్శలు చేస్తూ వైసీపీ బాటలో నడుస్తోంది. వరద విపత్తు గురించి, లడ్డూ వివాదం గురించి సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు ఇటీవల విజయవాడలోని ఏచూరి సీతారాం సంస్మరణ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం, మతం విషయాలను రాజాకీయాలకు ఆపాదించరాదని ప్రభుత్వానికి సూచించారు. ఇవి ఒకరకంగా వైసీపీకి ఊరట కలిగించాయి. మరోవైపు, వైసీపీ నేతలు ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే కమ్యూనిస్టులతో కలసి ముందుకు పోవాలనేది పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.