Saturday, April 20, 2024

కోహ్లీ…ఫిట్ నెస్ కా బాప్

- Advertisement -

ఏ ఆటలోనైనా ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ లో ఫిట్ నెస్ లేకుంటే జట్టులో చోటే గల్లంతవుతుంది. ఒకప్పుడు భారత క్రికెట్ లో ఫిట్ నెస్ ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉండేవి. క్రమంగా తర్వాత ఫిట్ నెస్ ప్రమాణాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు మాత్రం టీమ్ ను వెంటాడుతూనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు భారత క్రికెట్ టీమ్ కు సంబంధించి అత్యుత్తమ ఫిట్ నెస్ ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. గ్రౌండ్ లో తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన కోహ్లీ ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడడు. ప్రాక్టీస్ తో సమానంగా జిమ్ లో ఎంతో కష్టపడతాడు.
కోహ్లీ ఫిట్ నెస్ చూసి విదేశీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే కోహ్లీ ఎక్కువగా గాయాల బారిన పడడు. ఈ విషయం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ సైతం స్పష్టం చేసింది. ఎన్ సిఎ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది కోహ్లీ ఒక్కసారి కూడా గాయపడలేదు. గాయపడిన ఆటగాళ్ళు చికిత్స, తర్వాత రిహాబిలిటేషన్ కోసం ఎన్ సిఎకు వెళ్ళాల్సిందే. కోహ్లీకి మాత్రం ఈ సీజన్ లో అక్కడికి వెళ్ళే అవసరం రాలేదు. ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్న 70 మంది ఆటాగాళ్లకు సంబంధించి 96 గాయాలకు చికిత్స చేసామని జాతీయ క్రికెట్ అకాడమీ నివేదిక ద్వారా తెలుస్తోంది. 70 మంది ఆటగాళ్లలో 23 మంది సీనియర్ ఇండియా ప్లేయర్లు, 25 మంది భారత్ ఏ టీమ్ క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ తప్పిస్తే కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్, పుజారా, ధావన్, హార్దిక్, ఉమేశ్, జడేజా, పంత్, శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్ వంటి గాయాలతో ఎన్ సిఎకు వెళ్ళినవారే. అయితే కోహ్లీ ఫిట్ నెస్ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండడంతోనే ఎక్కువగా గాయాలపాలు కాలేదని ఎన్ సిఎ వర్గాలు వెల్లడించాయి. విరాట్ చివరిసారిగా 2018లో వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. అప్పటి నుంచీ ఎటువంటి గాయాలూ లేకుండా ఆడుతూనే ఉన్నాడు. అందుకే యువక్రికెటర్లు అందరూ కేవలం ఆటలోనే కాదు ఫిట్ నెస్ అంశంలోనూ విరాట్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!