Monday, February 10, 2025

కోటంరెడ్డికి దీటైన అభ్యర్థి రెడీ.. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రూరల్ బాధ్యతలు

- Advertisement -

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జి కోసం వైసీపీ అన్వేషిస్తోందా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గట్టిగా డీ కొట్టే నేత కోసం వెతుకుతోందా? ఆదాల ప్రభాకర్ రెడ్డి బలం చాలడం లేదని అంచనాకు వచ్చిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019 ఎన్నికల్లో సైతం రెండోసారి విజయం సాధించారు. ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కాస్త ముదిరి ఆయనను రెబెల్ ఎమ్మెల్యేగా మార్చింది. వైసిపి తో పాటు జగన్ కు వ్యతిరేకంగా గళం ఎత్తేలా చేసింది. టిడిపిని మరింత దగ్గర చేసింది. దీంతో ఎన్నికలకు ముందు కోటంరెడ్డి సైకిల్ ఎక్కారు. ఒక్క కోటంరెడ్డి కాదు.. జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికలకు నెలల వ్యవధి ముందు అదే జిల్లాకు చెందిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీని వీడారు. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఒకేసారి వీడడంతో పార్టీకి దారుణ దెబ్బ తగిలింది. కూటమి స్వీప్ చేసింది.

అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి బలంగా ఉన్న నెల్లూరులో ఆ పార్టీ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం కోటంరెడ్డి అన్నది వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఆగ్రహం. ఒకప్పుడు జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శించే వారు కోటంరెడ్డి. అధినేతపై ఈగ వాలనిచ్చేవారు కాదు. అటువంటి కోటంరెడ్డి మంత్రి పదవి దక్కకపోయేసరికి అధినేతను తీవ్రంగా విభేదించారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో పార్టీని ధిక్కరించిన తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. అయితే కోటంరెడ్డి వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్నది ఆయనపై అధినేతతో పాటు పార్టీ శ్రేణుల కోపం. అందుకే వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. సరైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నారు. అయితే ఆయనకు ధీటైన అభ్యర్థి దొరికినట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని గట్టిగా ఢీకొట్టగలరని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మంత్రిగా ఉండేటప్పుడు నెల్లూరు సిటీ తో పాటు రూరల్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేవారు అనిల్. మరోవైపు రూరల్ నియోజకవర్గం లో యాదవ సామాజిక వర్గం అధికం. అందుకే అనిల్ ను బరిలో దించితే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. యాదవ సామాజిక వర్గం కలిసి వస్తుందని జగన్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. అయినా సరే ఓటమి తప్పలేదు. అప్పటినుంచి సైలెంట్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాల్లో మునిగితేలారని కామెంట్స్ వినిపించాయి. అయితే అతి త్వరలో అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అవుతారని తెలుస్తోంది.

వచ్చే నెలలో జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధపడుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల నాయకత్వాలను, నియామకాలను పూర్తి చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జిగా నియమిస్తారని సమాచారం. ఇప్పటికే ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసింది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ చేసి జిల్లా బాధ్యతలు కూడా ఆయనకు కట్టబెట్టే ఛాన్స్ కనిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!