అధికార వైసీపీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. తాజాగా మరో నేత జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుని సంచలనం సృషించారు. ఆ నేత ఎవరో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. కాపు రామచంద్రారెడ్డి.. అనంతపురం రాజకీయాలలో పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు ఇది. రాజకీయాలలో వచ్చిన తొలి రోజుల నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ అభిమానిగానే కొనసాగారు. వైఎస్ఆర్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.
కాపు రామచంద్రారెడ్డి మీద నమ్మకంతో 2019 ఎన్నికల్లో రాయదుర్గం ఎమ్మెల్యేగా తిరిగి వైసీపీ తరుఫున బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి కూడా లభిస్తుందని అందరు భావించారు. కాని కొన్ని సామాజిక సమీకరణాలు ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నాయి. అయినప్పటికి కూడా కాపు రామచంద్రారెడ్డికి జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం జరిగింది.
అయితే సడన్‌గా కాపు రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. తన వ్యక్తిగత కారణాలతోనే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. కాపు రామచంద్రారెడ్డి కుటుంబంలో ఇటీవలే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆయన అల్లుడు మంజునాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో కాపు రామచంద్రారెడ్డి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లుడు మరణించిన దగ్గర నుంచి కాపు రామచంద్రారెడ్డి పెద్దగా బయటకు రావడం లేదు. అల్లుడు మంజునాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడాన్ని కాపు రామచంద్రారెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
దీని కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాల మీద దృష్టి సారించలేకపోతున్నారని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం కావడంతో.. జిల్లా బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన జగన్‌కు ఓ లేఖ కూడా రాయడం .జరిగింది. తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన విజ్ఞప్తి మన్నించాలని, రాజీనామాను ఆమోదించాలని కోరారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలతోపాటు ఎమ్మెల్యేగా పోటీచేయాల్సి ఉండటంతో.. రెండింటికీ న్యాయం చేయలేనని భావించి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాపు రామచంద్రారెడ్డి జిల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడం పార్టీకి లోటే అని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరి ఆయన స్థానంలో ఎవరిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తారో చూడాల్సి ఉంది.