నటుడు అలీ పూర్తిగా రాజకీయ నాయకుడుగా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆయనకు ఇటీవల అధికార వైసీపీ పార్టీ ఎలాక్ట్రానిక్ మీడియా ఇంచార్జ్ పదవిని అప్పగించడం జరిగింది. అలీ అలా బాధ్యతలను తీసుకున్నారో లేదో సోషల్ మీడియాలో తమ నాయకుడు మీద ఎవరైనా పోస్టులు పెడితే సహించేది లేదని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీ నుంచి జగన్ వెంట నడిచింది అతి కొద్ది మాత్రమే. పోసాని, 30 ఇయర్స్ పృథ్వీ వంటి వారు మాత్రమే వైసీపీ పార్టీకి అండగా నిలబడ్డారు. కాని నటుడు అలీ 2019 ఎన్నికల ముందు జగన్‌ను కలిసి అనుహ్యంగా వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్‌కు సన్నిహితుడు కావడంతో.. అందరు ఆయన జనసేన పార్టీలో చేరుతారని భావించారు. కాని అలీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తు.. వైసీపీలో చేరి షాకిచ్చారు.
అలీ వైసీపీలో చేరడంపై అటు పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అలీ కూడా తనని మోసం చేశాడని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. దీనిపై అలీ పవన్‌కు గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో.. అలీకి ఏదో ఒక పదవి వస్తుందని చాలామంది భావించారు. అలీకి ఎమ్మెల్సీ ఇస్తున్నారని.. రాజ్యసభ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. కాని అలీకి ఎటువంటి రాజకీయ పదవి దక్కలేదు. ఆ మధ్య అలీ వైసీపీ నుంచి బయటకు వస్తున్నారని.. ఆయన జనసేనలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన అలీ తాను వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అలీకి ఎలాక్ట్రానిక్ మీడియా ఇంచార్జ్ పదవిని అప్పగించింది జగన్ సర్కార్. పదవి ఇచ్చిన తరువాత మర్యాదపుర్వకంగా కుటంబ సమేతంగా అలీ జగన్‌ను కలిసి వచ్చారు.
తాజాగా ఆయన ఎలాక్ట్రానిక్ మీడియా ఇంచార్జ్ పదవి బాధ్యతలను స్వీకరించిన వెంటనే .. తమ రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. జగన్‌గారి మీద పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడితే వారి తాట తీస్తాం అని అలీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైఎస్ కుటుంబం మీద ఎక్కడైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన కూడా వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని అలీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలీ వ్యాఖ్యలు విన్న తరువాత ఆయన పూర్తిగా రాజకీయ నాయకుడులా మారిపోయినట్లుగానే ఉందని వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి