దేవినేని ఉమకు షాక్..దేవినేని ఉమ వద్దంటున్న తెలుగు తమ్ముళ్లు
ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల రూటే సపరేటుగానే అని చెప్పాలి. ఇక్కడ పార్టీల ఇమేజ్ కన్నా కూడా వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువుగా కనిపిస్తుంటుంది. జిల్లాలో ఏ పార్టీ అభ్యర్థైన విజయం సాధించాలన్న .. ఓడిపోవాలన్న కూడా ప్రత్యర్థులు అవసరం లేదు. ఇక్కడ గెలుపుకు అయిన, ఓటమికైన సొంత పార్టీ వారే కేంద్ర బిందువుగా నిలుస్తుంటారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో అధికార , ప్రతిపక్షా పార్టీలు నువ్వా నేనా అనే విధాంగా కొట్లాడుకుంటున్నాయి. మైలవరంలో ఎప్పుడు కూడా ఎన్నికల వాతవరణమే కనిపిస్తుంటుంది. నాయకుల మధ్య ఎల్లప్పుడు ఘర్షణలు చోటు చేసుకుంటునే ఉంటాయి. ముఖ్యంగా మైలవరంకు దేవినేని ఉమ వచ్చిన తరువాత నుంచి నియోజకవర్గంలో రాజకీయ వైరం గ్రామాలకు వరకు వెళ్లిందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన దేవినేని ఉమ..2019 ఎన్నికల్లో 12 వేల ఓట్లపైగా తేడాతో తన రాజకీయ ప్రత్యర్థి అయిన వసంత కృష్ణప్రసాద్ చేతిలో దారుణంగా ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బొమ్మసాని సుబ్బారావు అండతో గెలిచారనే అపవాదు దేవినేని ఉమపై ఉంది. బొమ్మసాని సుబ్బారావును కావాలనే ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయించి…ఓట్లు చీలేలా చేశారని.. లేకపోతే 2014 ఎన్నికల్లో మైలవరంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించేవారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. 2014 టీడీపీ కూడా అధికారంలోకి రావడంతో..దేవినేని ఉమ మంత్రి కూడా అయ్యారు. అసలు దేవినేని ఉమ మంత్రి అయిన తరువాతే నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట మసకబారిందనే వాదన కూడా ఉంది. ఆయన తీరుతో చాలామంది పార్టీని వదిలిపెట్టారు. ఓడిపోయి మూడేళ్లు దాటిపోయినప్పటికి కూడా .. ఇప్పటికి మైలవరం నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.
దీంతో మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలు ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బొమ్మసాని సుబ్బారావును పిలవడం సంచలనంగా మారింది. దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో దేవినేని ఉమ ఫోటో లేకపోవడంతో మరో వాదనకు దారి తీసింది. ముఖ్య అతిథిగా బొమ్మసాని సుబ్బారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అందరిది.. అందరం కలిసి పని చేస్తే మళ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన ఎక్కడ కూడా దేవినేని ఉమ పలకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీనికి తోడు ఉమది నాన్ లోకల్ అనే వాదనను బొమ్మసాని తెర మీదకు తీసుకువచ్చారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడినట్లు అయింది. ఒకప్పుడు దేవినేని ఉమ గెలుపుకు కృషి చేసిన బొమ్మసాని.. ఇప్పుడు దేవినేని ఉమకు వ్యతిరేకంగా మారినట్లుగా మైలవరం నియోజకవర్గంలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేవినేని ఉమ వద్దు.. బొమ్మసాని ముద్దని తెలుగు తమ్ముళ్లు రోడ్డు ఎక్కడం సంచలనంగా మారింది. బొమ్మసాని మద్దతు లేకపోతే దేవినేని ఉమ గెలవడం కష్టమని రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు. మరి బొమ్మసానిని దేవినేని ఉమ ఎలా బుజ్జగిస్తారో చూడాలి. మరోవైపు ఈ పరిణామాలన్ని కూడా తమకు కలిసి వస్తాయని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గం భావిస్తోంది.