విజయసాయిరెడ్డి నిజంగా రాజకీయాలను వదిలేసారా? లేకుంటే తాత్కాలికంగా బ్రేక్ చెప్పారా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారా? దానినే కొనసాగించగలరా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసిపి అధినేత జగన్ తో దశాబ్దాల బంధాన్ని వదులుకున్నారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ పదవితో పాటు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. డేటు,టైమ్ చెప్పి మరి ఆయన రిజైన్ చేశారు. అయితే ఇక రాజకీయాల గురించి మాట్లాడనని తేల్చి చెప్పారు. కానీ ఇలా చెప్పి పది రోజులు కాకమునుపే నిత్యం పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారా? అలా చెప్పుకున్నారా? అన్నది అనుమానం కలుగుతోంది. ఏదో ఒత్తిడి వల్ల ఆయన అలా చేసి ఉంటారన్న టాక్ ప్రారంభం అయింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. వన్ ఫైన్ మార్నింగ్ ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామా లేఖ అందించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకున్నారు. దీంతో చైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అటు తరువాత అధినేత జగన్కు సుదీర్ఘ లేఖ రాశారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కూడా పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చారు. 2029 లో వైసీపీ ఘనవిజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. తద్వారా తన మనసులో ఇంకా వైసీపీ ముద్ర పోలేదని చెప్పుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లినట్లు సంకేతాలు ఇచ్చారు.
కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ చీఫ్ షర్మిలను కలిశారు విజయసాయిరెడ్డి. దాదాపు మూడు గంటల పాటు ఆమెతో సమావేశం అయ్యారు. హైదరాబాదు లోటస్ ఫండ్ లో వారి మధ్య కీలక చర్చలు నడిచాయి. విజయసాయిరెడ్డి అక్కడే లంచ్ చేశారట. అయితే గతంలో షర్మిలపై చేసిన విమర్శలకు వివరణ ఇచ్చేందుకు ఆయన అక్కడకు వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే భవిష్యత్తులో ఒకే ప్లాట్ఫామ్ పై షర్మిల తో కలిసి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని విజయసాయి రెడ్డి పై అప్పటినుంచి ప్రచారం ప్రారంభమైంది. రాజకీయాలు వద్దనుకొని వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి పొలిటికల్ జర్నీ ఆపడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి. అక్కడే అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్ర బడ్జెట్ పై ఆయన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర పెద్దలను పొగడ్తలతో ముంచేత్తారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం ఇచ్చిందని కొనియాడారు. ఇప్పటికీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. రాజకీయాలు మాట్లాడనని.. శాశ్వతంగా రాజకీయాలకు దూరమయ్యారని చెప్పుకునే విజయసాయిరెడ్డి వ్యవహారం చూస్తుంటే ఏదో అనుమానం వేస్తోంది. ఆయన బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం అవుతోంది. క్రమేపి ఆయన బిజెపికి దగ్గర అవడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికి అయితే తనకు ఈ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూనే.. పొలిటికల్ బంధాన్ని వీడలేక పోతున్నారు విజయసాయిరెడ్డి. మున్ముందు ఆయన ప్రకటనలు ఎలా ఉంటాయో అన్న చర్చ అయితే మాత్రం నడుస్తోంది.