Monday, February 10, 2025

జగన్ ఎమ్మెల్యే పదవి పై సస్పెన్షన్ వేటు.. ఆ ప్రచారంలో నిజం ఎంత?

- Advertisement -

వైసిపి అధినేత జగన్ పై వేటు పడుతుందా? అసెంబ్లీకి రాకుంటే ఆయన పదవికి ప్రమాదమా? పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయా? ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీ వార్షిక బడ్జెట్ ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇంకోవైపు ఈ సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రావడం లేదు.

ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన జగన్ బెంగళూరులో ఉన్నారు. ఈరోజు తాడేపల్లి కి రానున్నారు. పార్టీ ముఖ్యులతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వం తో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. నేరుగా ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా సమర్పించారు. తరువాత పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ రాశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారు. ఇటీవల ఆయన బెంగళూరు తిరిగి వచ్చారు. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ కు రానున్నారు. విజయసాయిరెడ్డి విషయంలో ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు పై పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకొనున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగింది ఆ పార్టీ. కానీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ప్రభుత్వంతో పాటు స్పీకర్ విచక్షణాధికారంతో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి 135 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అటు తరువాత జనసేనకు 21 సీట్లు వచ్చాయి. వైసిపికి 11 స్థానాలు వచ్చాయి. అయితే వైసీపీ కంటే జనసేన సీట్లు అధికం. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. కానీ ఆ పార్టీ అధికారాన్ని పంచుకుంటుంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. అందుకే వైసిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో ఆయన అసెంబ్లీకి రావడం మానేశారు.

ఫలితాలు వచ్చిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అటు తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం పై లేఖలు రాస్తున్నారు. అయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కావడంతో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సమావేశాలకు జగన్ హాజరైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే ఈ విషయంలో పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు.

అయితే అదే సమయంలో కూటమి పార్టీలు ఒక కొత్త స్లోగన్ బయటపెట్టాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకపోతే సస్పెన్షన్ వేటు పడుతుందన్నది వారు చేస్తున్న ప్రకటనలు. అలా అయితే చంద్రబాబు సుమారు మూడేళ్ల పాటు అసెంబ్లీకి రాలేదు. తన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021 నవంబర్ 19న చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. తనను అవమానించిన శాసనసభకు మళ్ళీ ముఖ్యమంత్రి గానే వస్తానని చెబుతూ బయటకు వెళ్లిపోయారు. మూడేళ్ల పాటు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. అలాగని ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం పోలేదు. కానీ అది తెలిసి కూడా వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పై కూటమి ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదు అని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా 60 రోజులపాటు సమావేశాలకు హాజరు కాకుంటే సస్పెన్షన్ ఉత్తమటేనని తేల్చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!