ప్రజాస్వామ్యం గురించి టిడిపి తో పాటు జనసేన నేతలు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తుంటారు. ఇప్పటికీ అదే మాట చెబుతుంటారు. కానీ నిన్న జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం మారింది అధికారమే. వ్యవస్థలు అలానే ఉన్నాయి. విధానాలు అలానే ఉన్నాయి. పది చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకు ఎక్కడా బలం లేదు. కానీ ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించిన తీరు చూస్తుంటే.. మున్ముందు ఏపీలో ఎలాంటి పరిణామాలు చూస్తామో అన్న ఆందోళన కనిపిస్తోంది. ఏ విధ్వంసం చూసి ప్రజలను తమ వైపు తిప్పుకున్నారో.. అదే విధ్వంసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించారు కూటమి నేతలు.
ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో అయితే టిడిపి కూటమి విధ్వంసం అంతా ఇంతా కాదు. బస్సుల అద్దాలను పగులు కొట్టడం.. మహిళా కార్పొరేటర్ లను అడ్డగించడం.. వైసిపి నేతలపై దాడులకు వెనుకడుగు వేయకపోవడం వంటివి అడుగడుగునా కనిపించాయి. వైసిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లను ఆ పార్టీ గెలుచుకుంది. ఆ సమయంలో భారీ విధ్వంసాలు జరిగాయి అన్నది టిడిపి చేసిన ఆరోపణ. ఇలా ప్రభుత్వం ఉండి ఏకపక్షంగా వ్యవహరిస్తే తాము జడ్పిటిసి, ఎన్నికల్లో పోటీ చేయమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆ ఎన్నికలను బహిష్కరించారు. అయితే వైసీపీ హయాంలో ఎన్నికలు సజావుగా జరగలేదని అప్పట్లో ఆరోపించింది టిడిపి. కానీ నిన్న జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలు చూస్తే టిడిపి కూటమి చేసింది విధ్వంసమా? లేకుంటే మరో రకమా అన్నది చెప్పాల్సింది చంద్రబాబే.
కేవలం 10 నెలల పాటు సమయం మాత్రమే ఉంది. మరో 10 నెలల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుంది. కానీ ఈ 10 నెలల కాలం పాటు కూడా వైసీపీ నేతలు ప్రతినిధులుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయింది కూటమి. వచ్చే ఐదేళ్లలో జరిగే ఏ ఎన్నికలు అయినా పరిస్థితి ఇలానే ఉంటుందని సంకేతాలు పంపించింది. అయితే అప్పట్లో విధ్వంసం అని పేరు చెప్పి.. వైసిపి పై నిందలు మోపింది కూటమి. ప్రజలు కూడా బలంగా నమ్మారు. కానీ ఇప్పుడు వారు చేస్తుందేంటి. అంతకుమించిన విధ్వంసం కనిపిస్తుండడంతో ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు. అక్కడ మారింది ప్రభుత్వమే తప్ప.. విధానాలు అవేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
వ్యవస్థలు అనేవి ప్రత్యర్థులకు రక్షణ కల్పించాలి. కానీ ఏపీలో వ్యవస్థలు మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నాయి. అధికార పార్టీ సిఫార్సులకు తలుగుతున్నాయి. అధికార పార్టీ దాస్టీకాలకు అడ్డగోలుగా నిలుస్తున్నాయి. అక్కడ వైసీపీ ఉంటే ఆ పార్టీకి… కూటమి ఉంటే ఆ మూడు పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. అంతే తప్ప అక్కడ తప్పు జరుగుతోంది.. దానిని నియంత్రించాలి అనే ప్రయత్నం అంటూ చేయడం లేదు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. అప్పట్లో విధ్వంసం అనే మాట వైసీపీకి అంటగట్టారు. కానీ ఇప్పుడు అదే విధ్వంసం పాల్పడుతూ కూటమి ప్రభుత్వం అంతకుమించి అన్నట్టు వ్యవహరిస్తోంది. ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవం తెలుస్తోంది.