Thursday, March 28, 2024

భారత్‌,ఇంగ్లాండ్ …హోరాహోరీ ఖాయం

- Advertisement -

టీ ట్వంటీ ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్లో తలపడబోయే భారత్ -ఇంగ్లాండ్ జట్లలో ఏదో ఒక జట్టును ఫేవరిట్ గా చెప్పలేం. ఎందుకంటే రెండు జట్లూ దాదాపు సమఉజ్జీలుగా ఉన్నాయన్నది చాలా మంది చెబుతున్న మాట. నిజానికి ఈ మెగా టోర్నీలో భారత్ సెమీస్ చేరడం కష్టమేనని కపిల్‌దేవ్ వంటి మాజీలు అంచనా వేశారు. పేస్ బౌలర్ బుమ్రా లేని భారత జట్టు లీగ్ దశనుంచే వెనుతిరుగుతుందన్నారు. అయితే తన తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై ఘన విజయాన్ని నమోదు చేసుకున్న భారత్ అదే ఊపును ఆ తర్వాత కొనసాగించింది. ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోనే చెత్త ఫీల్డింగ్ చేయడం వల్ల నెగ్గాల్సిన మ్యాచ్ ను భారత్ చేజార్చుకుంది. ఆ తర్వాత బంగ్లాడేశ్, జింబాబ్వేలపై అద్భుత విజయాలు నమోదు చేసుకుని తన గ్రూప్ లో టాపర్ గా నిలిచింది. ఈ సారి మాత్రం కప్ సాధించాలన్న పట్టుదల ప్రతీ ఆటగాడిలోనూ కనిపిస్తోంది. అది వారి ఆటతీరులో ప్రతిబింబిస్తోంది.

బ్యాటింగ్‌లో కె.ఎల్, రాహుల్ ఫాంలోకి రావడం, విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శిస్తూ ఉండడం, మిస్టర్ 360 డిగ్రీస్ సూర్య కుమార్ యాదవ్ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా చెలరేగిపోవడం భారత జట్టుకు కొండంత బలం. ముఖ్యంగా సూర్యకుమార్‌ను ఎలా అడ్డుకోవాలన్నది ప్రత్యర్థి జట్లకు అర్థం కావడం లేదు. అతన్ని అడ్డుకోకుంటే మ్యాచ్‌లో విజయంపై ఆశలు వదులుకోవచ్చని ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు ఇప్పటికే నిర్ణయానికొచ్చేశారు. అటు బౌలింగ్ లోనూ బుమ్రా లేని లోటును కొత్త కుర్రాడు అర్షదీప్ సింగ్ భర్తీ చేస్తోన్న తీరు అద్బుతం. లీగ్ దశలో అయిదు మ్యాచుల్లో పది వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. చివరి రెండు మ్యాచుల్లో భువనేష్ కుమార్ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధులను డిఫెన్స్ లో పడేశాడు.

మరోవైపు స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్ భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. చివరి మ్యాచులో మూడు వికెట్లు తీసినా కూడా అశ్విన్ బౌలింగ్ ఆకట్టుకోవడం లేదు. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమికి అశ్విన్ భారీగా పరుగులు ఇవ్వడమే కారణమన్న విమర్శలూ వచ్చాయి. సెమీస్, ఫైనల్ మ్యాచులకుచాహల్ ను జట్టులోకి తీసుకు రావచ్చునన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌నే కొనసాగించే అవకాశముంది. ఇదిలా ఉంటే వాల్డ్ కప్ ఫేవరిట్లలో ఇంగ్లాండ్ కూడా బలమైన జట్టే. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లోనే కాదు ఫీల్డింగ్ లోనూ ఇంగ్లాండ్ రెచ్చిపోతోంది. ఐర్లాండ్ జట్టు చేతిలో ఓటమి ఒక్కటే లీగ్ దశలో ఇంగ్లాండ్ ను బాగా కలచి వేసింది. కాకపోతే సూపర్ బ్యాటర్ డేవిడ్ మలాన్ సెమీస్ కు దూరం కావడం ఇంగ్లాండ్ కు మైనస్సే. బ్యాటింగ్‌లో బట్లర్, స్టోక్స్, హేల్స్‌ ఫామ్‌లో ఉండగా.. పింఛ్ హిట్టర్ లివింగ్‌స్టోన్‌ మెరుపుల కోసం ఇంగ్లీష్ టీమ్ ఎదురుచూస్తోంది. మొయిన్ అలీ కూడా ఇటు బంతితోనూ, అటు బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉన్నవాడే. బౌలింగ్‌లో మార్క్‌ వుడ్, వోక్స్, శామ్ కురన్‌పై అంచనాలున్నాయి. షార్ట్ ఫార్మేట్ కావడంతో ఖచ్చితంగా ఎవ్వరినీ ఫేవరెట్‌గా చెప్పలేం. సెమీస్‌లో ఉండే ఒత్తిడిని అధిగమించి బాగా ఆడిన జట్టే గెలుస్తుందన్న అంచనాల మధ్య నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ జరిగే అవకాశముంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!