బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. యువతలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మాటల్లో దిగువ ఉంది. టెంపరితనం దాగి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ఫైర్ బ్రాండ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. అయితే ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈసారి మాత్రం పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి ప్రత్యేక చరిత్ర. తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుగా నిలిచింది ఈ కుటుంబం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వయాన సిద్ధార్థ రెడ్డికి పెదనాన్న. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్వయాన పెదనాన్న కుమార్తె. అయితే ప్రస్తుతం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలో ఉండగా.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఇన్ని రోజులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక సాయం అందించారు. నందికొట్కూరు నియోజకవర్గం లో పెను ప్రభావం చూపుతూ వచ్చారు. అయితే కూటమి పుణ్యమా అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి నంద్యాల అసెంబ్లీలో పట్టు చిక్కింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీ ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి బైరెడ్డి శబరి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి నంద్యాల సీటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిది. 2014, 2019 ఎన్నికల్లో నంద్యాల సీటును చాలా ఈజీగా దక్కించుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభావంతో నంద్యాల సీటును ఓడిపోయింది. మరోసారి నంద్యాల సీటును నిలబెట్టుకోవాలంటే బలమైన నేత అవసరం. అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బరిలో దించనున్నట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్దగా కనిపించలేదు. కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని భావించి ఆయన వెనక్కి తగ్గారు. అయితే రకరకాల ప్రచారం ఆయన చుట్టూ నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నియమితులయ్యారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఉండేది. కానీ రకరకాల సమీకరణలతో ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే యువతలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సేవలను వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వినియోగించుకుంటారని తెలుస్తోంది. నంద్యాల పార్లమెంట్ స్థానం కాకుంటే పాణ్యం అసెంబ్లీ సీటు అయినద ఇస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.