Tuesday, April 22, 2025

గన్నవరం వైసీపీ ఇన్చార్జిగా పంకజశ్రీ?

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కృష్ణాజిల్లా పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జ్ ప్రకటనకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అక్కడ ఇన్చార్జిగా వల్లభనేని వంశీ మోహన్ ఉండేవారు. ప్రస్తుతం ఆయన కేసుల్లో చిక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. దీంతో ఆయన బయటకు ఎప్పుడు వస్తారో తెలియడం లేదు.

గన్నవరం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ప్రస్తుతం నిలిచిపోయాయి. కనీసం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేసుకునే వారు కూడా కరువయ్యారు. ఈ క్రమంలో అక్కడ అర్జెంటుగా నాయకత్వం అవసరమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అలాగని వల్లభనేని వంశీ మోహన్ ను కాదని వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ శ్రేణులకు రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళుతుంది. అందుకే అక్కడ వ్యూహాత్మకంగా వల్లభనేని వంశీ భార్యను ఇన్చార్జిగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

అక్రమ కేసులతో వల్లభనేని వంశీ మోహన్ పై ఉక్కు పాదం మోపింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం కేసుల మీద కేసులు నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన భార్య పంకజశ్రీ భర్త కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. తెగువ ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణులకు సైతం అండగా నిలుస్తున్నారు. ఆపై కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా గట్టిగానే నిలదీతకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆమెను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

2009 ఎన్నికల్లో టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్. తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం లో గట్టి పట్టు సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని సైతం తట్టుకునే నిలబడ్డారు. కానీ ఆయన చంద్రబాబు నాయకత్వాన్ని విభేదిస్తూ జగన్ గూటికి వచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత ఐదేళ్లుగా వల్లభనేని వంశీ మోహన్ వ్యవహార శైలితో కూటమి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ మోహన్ ను విడిచి పెట్టే అవకాశం లేదు. అందుకే గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు ఆయన భార్య పంకజ శ్రీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సైతం అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!