వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం పై ఫోకస్ పెట్టారా? ఆ సామాజిక వర్గం నేతలను తిప్పుకునే పనిలోపడ్డారా? చంద్రబాబు ఫార్ములాను అనుసరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు రెడ్డి సామాజిక వర్గం పై దృష్టిపెట్టారు. వారిని టిడిపి వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. సహజంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణమైంది. దీని నుంచి గుణపాటాలు నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఏపీలో విచిత్ర రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ సామాజిక వర్గాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. తెలుగుదేశం అంటే కమ్మ, వైయస్సార్ కాంగ్రెస్ అంటే రెడ్డి, జనసేన అంటే కాపు అన్నట్టు పరిస్థితి ఉంటుంది. అయితే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ సామాజిక వర్గ సమీకరణ మారుతుంటుంది. మొన్నటి ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ అయింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ కు డ్యామేజ్ జరిగింది. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం టిడిపి కోసం గట్టిగా పోరాటం చేసింది. తద్వారా కూటమి గెలుపునకు దోహద పడింది. ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గం నేతలు ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, తలసీల రఘురాం, బొల్లా బ్రహ్మనాయుడు వంటి చాలామంది నేతలు ఉన్నారు. మధ్యలో కేశినేని నాని లాంటి నేతలు ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్దిపాటి కమ్మ నాయకులను టార్గెట్ చేసింది. ప్రస్తుతం కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారు. వల్లభనేని వంశీ మోహన్ జైల్లో గడుపుతున్నారు.
అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఇటువంటి తరుణంలో బలమైన కమ్మ సామాజిక వర్గం నేతలను పార్టీలోకి తెస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను పార్టీలోకి తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహిత నేత లగడపాటి రాజగోపాల్. లాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ గా ఉండేవారు. చంద్రబాబుకు వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2003లో రాజశేఖరరెడ్డి పాదయాత్ర పర్యవేక్షకుడిగా వ్యవహరించారు.
2004, 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు లగడపాటి రాజగోపాల్. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు సాధించారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ వైపు ఉండిపోయారు లగడపాటి రాజగోపాల్. 2014లో రాష్ట్ర విభజనకు ముందు కేసిఆర్ కు దీటుగా నిలబడ్డారు లగడపాటి. సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించారు. పార్లమెంటులో సైతం తన వాదనను వినిపించ గలిగారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
అయితే 2014 ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉండిపోయారు. క్రమేపి తెలుగుదేశం పార్టీకి దగ్గర అయినట్టు కనిపించారు. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని తాను చేపట్టిన సర్వేను వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి సూపర్ విక్టరీ సాధించడంతో ఎన్నికల సర్వేకు స్వస్తి పలుకుతున్నట్లు చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని తెగ హడావిడి నడిచింది. కానీ అప్పుడు కూడా ఎటువంటిది లేకుండా పోయింది.
అయితే తాజాగా లగడపాటి రాజగోపాల్ వైయస్సార్ కాంగ్రెస్ గూటికి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్న తరుణంలో లగడపాటి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. 2029 ఎన్నికలకు ముందు లగడపాటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెచ్చేందుకు ఒకప్పటి వైయస్సార్ సన్నిహిత నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు లగడపాటి సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.