వైసిపి అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధపడుతున్నారా? త్వరలో పాదయాత్ర చేయాలని భావిస్తున్నారా? వైసిపి పూర్వవైభవం కోసం తహతహలాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి దక్కింది కేవలం 11 స్థానాలే. ఇక వైసిపికి భవిష్యత్తు లేదనుకున్నవారు పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. చివరకు జగన్కు అత్యంత నమ్మకస్తులు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. దీంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందుకే జనంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ త్వరలో ఏపీ కి రానున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఇందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ సిద్ధమైంది.
పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జగన్ పర్యటన సాగనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారానికి మూడు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులతో మమేకం కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అందరి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. పటిష్టమైన నాయకత్వం దిశగా అడుగులు వేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి అనుభవజ్ఞుడైన నాయకుడిని ఇన్చార్జిగా నియమించేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఓటమి తర్వాత చాలామంది నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. వారందరినీ యాక్టివ్ మోడ్లోకి తేనున్నారు జగన్. ఎందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో పటిష్టమైన నాయకత్వాన్ని తేనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు 2018 మాదిరిగా పాదయాత్ర చేసేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు సమాచారం. పాదయాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యింది. ఆ సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పగ్గాలు అందుకొని రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రతి పౌరుడి సమస్యలు తెలుసుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. ప్రజలతో మమేకమయ్యారు. దానిని ప్రజలు కూడా గుర్తించారు. అందుకే 2019 ఎన్నికల్లో అంతులేని మెజారిటీని కట్టబెడుతూ.. వైసీపీకి విజయాన్ని అందించారు. మళ్లీ ఇప్పుడు అంతటి విజయాన్ని అందుకునేందుకు జగన్ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
నేనున్నాను.. నేను విన్నాను.. నేను చూసుకుంటాను.. అన్న నినాదంతో ముందుకు సాగింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. వాస్తవానికి 2011లో వైసీపీ ఆవిర్భవించింది. ఆ సమయంలో సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధపడ్డారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కానీ అప్పుడే కేసులతో అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. సుమారు 16 నెలలపాటు జగన్ జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో సోదరుడి బదులు షర్మిల రంగంలోకి దిగారు. పాదయాత్ర చేశారు. అప్పట్లో జగన్ ప్రయత్నం అలా విఫల యత్నంగా మారింది. కానీ 2018లో చేసిన పాదయాత్ర మాత్రం సక్సెస్ అయ్యింది. ఆస్పూర్తితోనే మరోసారి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.
అయితే పాదయాత్ర చేయాలంటే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వైసీపీని కాపాడుకోవాలంటే జగన్ ముందు ఉన్న ఏకైక కర్తవ్యం పాదయాత్ర. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాము సంక్షేమ పథకాలు అమలు చేయలేమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లి వివరించగలిగితే వారి నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ముందుగా జిల్లాల పర్యటన పూర్తి చేస్తారు. అది విజయవంతం కాగానే పాదయాత్రకు సిద్ధపడతారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధమైనట్లు సమాచారం. మున్ముందు దీనిపై ఎలాంటి పరిణామాలు జరగబోతాయో చూడాలి. అయితే వైసీపీ శ్రేణులు సైతం అధినేత జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేయాలని కోరుతున్నట్లు సమాచారం. పాదయాత్ర ద్వారా పార్టీ పూర్వ వైభవం తద్యమని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ జగన్ పాదయాత్రగా అడుగు బయట పెడితే వైసీపీ శ్రేణులు మిన్నంటి ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది.