ఆయన నోటి నుంచి వచ్చే మాట తూటాల్లా ఉంటాయి. ప్రత్యర్థి ఎవరైనా.. ఎంతటి వారైనా లెక్క చేయరు.. అదే ఆయనకు కలిసి వచ్చిన అంశం.. అదే ఆయనకు వ్యతిరేకత తెచ్చిన అంశం అయ్యింది. అయితే అంతలా దూకుడు కలిగిన ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కనీసం కనిపించకుండా మానేశారు. దీంతో ఆయనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడు నెలలుగా కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? అంటే వాచ్ థిస్ స్టోరీ.
గుడివాడ అంటే ముందుగా గుర్తుకొచ్చేది కొడాలి నాని. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గ గుడివాడ. అటువంటి గుడివాడను కేరాఫ్ చేసుకుని గత రెండు దశాబ్దాలుగా రాజకీయం చేశారు కొడాలి నాని. ఒక హవ చలాయించారు. గుడివాడ కొడాలి నాని అడ్డా అంటూ సవాల్ చేసేవారు. అటు గుడివాడ ప్రజల సైతం కొడాలి నానిని ఎంతగానో ఆదరించేవారు. అందుకే ఎంతమంది వచ్చినా.. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కొడాలి నాని ఎప్పుడూ ఓడిపోలేదు. ఓటమి చవి చూడలేదు. అందుకే ఆయన పెద్ద పెద్ద ప్రకటనలు చేసేవారు. పెద్దలతో సైతం వ్యక్తిగత వైరం పెట్టుకునేవారు. కానీ కాలం ఒకలా ఉండదు కదా. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. దానిని జీర్ణించుకోలేని కొడాలి నాని ఇప్పుడు పూర్తిగా సైడ్ అయ్యారు. కనీసం ఎక్కడున్నారో తెలియడం లేదు. పక్క రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తనను నమ్ముకున్న వైసీపీ శ్రేణుల పరిస్థితిని మాత్రం ఆయన పట్టించుకోలేదు. కనీసం వారి గురించి ఆలోచన చేయడం లేదు.
తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చారు కొడాలి నాని. 1999 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి గెలిచారు. అంతకుముందు ఆయన మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 2004 ఎన్నికల్లో కొడాలి నాని తెరపైకి తెచ్చారు నందమూరి హరికృష్ణ. అన్నగారి సొంత నియోజకవర్గం, ఆపై హరికృష్ణ సిఫారసు, జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి వెరసి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో గెలిచారు నాని. కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.
2009 ఎన్నికల్లో రెండో సారి తెలుగుదేశం పార్టీ టికెట్ పై పోటీ చేశారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ అదే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి తరఫున ప్రచారం చేశారు. ఆ ప్రచార ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూశారు కొడాలి నాని. ఆ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం ఓడిపోయింది. అదే సమయంలో చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్కు విభేదాలు ప్రారంభమయ్యాయని ప్రచారం నడిచింది. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో విభేదించడం ప్రారంభించారు కొడాలి నాని. అక్కడ కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కొడాలి నాని.
2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడోసారి పోటీ చేశారు కొడాలి నాని. ఆ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది. కానీ గుడివాడ నుంచి కొడాలి నాని గెలిచారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న దూకుడు తనం ప్రదర్శించేవారు కొడాలి నాని. అందుకే వైసీపీలో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై విమర్శలు చేయాలంటే కొడాలి నాని రంగంలోకి దిగాల్సిందేనన్న టాక్ వైసిపి లో వినిపించేది. 2019లో కొడాలి నాని మంత్రి అయ్యేసరికి ఆయన దూకుడు మరింత పెరిగింది. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై వ్యక్తిగతంగా విరుచుకు పడడంలో ముందుండేవారు నాని. అసలు తెలుగుదేశం పార్టీ గెలవదని.. చంద్రబాబు గెలిచే ఛాన్స్ లో లేరని.. చంద్రబాబు గెలిస్తే ఆయన బూటు కాలును సైతం తుడుస్తానని చెప్పుకొచ్చారు నాని. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. తాను సైతం ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. కనీసం ఎక్కడున్నారో తెలియడం లేదు. వైసీపీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. కనీసం గుడివాడ వైపు తొంగి చూడడం లేదు. రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజం. ఆయన యాక్టివ్ అయి తిరిగి వస్తారని గుడివాడ వైసీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఏడు నెలలు అవుతుంది. ఓటమి నుంచి ఆయన బయటపడలేదు. ఇప్పటికైనా నియోజకవర్గంలో అడుగుపెడితే వైసీపీ పూర్వ వైభవం ఖాయమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక తేల్చుకోవాల్సింది కొడాలి నాని.