Monday, February 10, 2025

వైసిపి భవిష్యత్తు జగన్ పైనే.. కచ్చితంగా లేవాల్సిందే!

- Advertisement -

1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి సాగింది. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అంతకుముందు 1995లో టిడిపిలో సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు చంద్రబాబు. దానిని వెన్నుపోటు అని అభివర్ణించారు మెజారిటీ వర్గాలు. కానీ తన శక్తి యుక్తులతో 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం అందించగలిగారు చంద్రబాబు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసింది ఆ ఎన్నికలే. అప్పటివరకు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారన్నవారే.. చంద్రబాబు పాలనా దక్షుడిగా అభివర్ణించారు. చంద్రబాబు కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లింది ఎల్లో మీడియా. ఇక చంద్రబాబుకు ఈ రాష్ట్రంలో ఎదురు లేదు అనే గాలి వీచింది. కానీ దానికి బ్రేక్ వేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.

వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం అనేక ముళ్ళ కిరీటాలను దాటింది. వాస్తవానికి 1978లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు రాజశేఖర్ రెడ్డి. వైయస్ రాజారెడ్డి వేసిన పునాదిలో నిలబడ్డారు.. అదే పునాదిపై తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు రాజశేఖరరెడ్డి. కానీ కడప జిల్లా వరకే తన రాజకీయం పరిమితం అయింది. పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు దశాబ్దాల కాలం పట్టింది రాజశేఖర్ రెడ్డికి. అయితే తన సమకాలీకుడు చంద్రబాబు హవాను బ్రేక్ చేయాలంటే.. ఏం చేయాలనే ఆలోచనకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి. అటువంటి సమయంలో 2003లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం కావాలని భావించారు. సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా తొలిసారిగా రాజకీయ క్లిష్ట పరిస్థితిని అధిగమించారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లను అధిగమించి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోగలిగారు.

అయితే తండ్రి మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి సైతం ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు మహావృక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగారు. తండ్రి సమకాలీకుడైన చంద్రబాబును ఢీకొట్టారు. అయితే తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీని విభేదించడం సర్వసాధారణ విషయం కాదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే అదే పోరాటాన్ని, రాజశేఖర్ రెడ్డి తెగువను గత ఐదేళ్లుగా చూపించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తన మార్కు చూపలేదు. దాని ప్రభావం ఈ ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైంది. దాని నుంచి గుణపాటాలు నేర్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పై ఏర్పడింది. కానీ దానిని వదిలి.. జగన్మోహన్ రెడ్డి వేరే రూట్ లో వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

తన తండ్రి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. 1978లో తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభిస్తే.. 2004లో పూర్తిస్థాయి ఈ రాష్ట్రంపై పట్టు దొరికింది రాజశేఖర్ రెడ్డికి. కానీ జగన్మోహన్ రెడ్డి 2009లో రాజకీయ తెరపైకి వస్తే.. అనతి కాలంలోనే రాజకీయంగా తన మార్కు చూపించగలిగారు. 2014లో తొలిసారిగా గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాను దక్కించుకోగలిగారు. 2019లో దేశం తన వైపు చూసుకునేలా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో అదే స్థాయిలో ఓటమి చవిచూసి.. అదే దేశం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు కూడా.

అయితే రాజకీయ పార్టీకి గెలుపు ఓటములు అనేవి సహజం. వాటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జగన్ పై అదే తరహా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఐదేళ్లపాటు కనివిని ఎరుగని రీతిలో పాలన సాగించారు. ఇప్పుడు ప్రజలు పక్కన పెట్టారు. ఇప్పుడే జగన్ పై బాధ్యత పెరిగినట్లు అయింది. ఇటువంటి సమయంలో పాత తరహాలో దూకుడుగా వ్యవహరిస్తే తగిన ఫలితం ఉంటుంది. ప్రజలతో మమేకం అయి పని చేస్తే అదే ప్రజలు గుర్తిస్తారు కూడా. వీటన్నింటినీ గమనించడం ద్వారా జగన్ తన పూర్వవైభవానికి తానే బీజం వేసుకోవాలి. ఒకవైపు మారీచులు లాంటి ప్రతిపక్షాలు.. ఇంకోవైపు అంచనాలు పెంచుకున్న ప్రజలు.. ఇలా విభిన్న భావోద్వేగాల నడుమ తనను తాను ప్రూవ్ చేసుకునే అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. మరి దీనిని అధిగమిస్తారో.. ఫెయిల్ అవుతారో చూడాలి. ఆయన పనితీరు బట్టి వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!