వైయస్సార్ కాంగ్రెస్.. ఈ పార్టీకి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఎవ్వరికీ లేనంత బలం సొంతం. ఈ పార్టీ ఏర్పాటు ప్రత్యేకం. పార్టీ అధినేత అంటే ఎనలేని గౌరవం. ఆయనపై ఈగ వాలనివ్వరు. అలా వాడితే విరుచుకు పడే బృందం ఒకటి ఉంటుంది. అందులో నాని త్రయం ఒకటి. మాజీ మంత్రి కొడాలి నాని, మరో మాజీ మంత్రి పేర్ని నాని, ఇంకో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఎన్నికలకు ముందు వచ్చి పార్టీలో చేరిన కేసినేని నాని. ఇలా చెప్పుకుంటే నాని అనే పదం వైసీపీలో ఒక విప్లవ స్వరం. పార్టీ అధినేత చుట్టూ ఉండే వలయం. కానీ అదే నాని అన్న పదం ఇప్పుడు వైసీపీలో వినిపించడం లేదు. ఆ స్వరం అనేది కనుచూపుమేరలో కనిపించడం లేదు. నాని స్వరం అన్నది అధికారంలో ఉన్నప్పుడే అని అర్థం వచ్చేలా విశ్లేషకులు.. విశ్లేషణలు చేసే పరిస్థితికి వచ్చింది.
2019లో దేశంలో మునుపెన్నడూ లేని విజయాన్ని సొంతం చేసుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అంతులేని మెజారిటీతో విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ వలయం లాంటి మంది మార్బలం. ఆపై అనుచర గణం. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు, వందల సంఖ్యలో నామినేటెడ్ పదవులను అలంకరించిన నాయకులు.. ఇలా శత్రు దుర్భేద్యం లాంటి జగన్ సామ్రాజ్యం. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ సామ్రాజ్యాన్ని కూల్చాయి. వైసిపి అధికారాన్ని కూకటి వేళ్ళతో పేల్చాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు తన వెంట ఉండే నాయకులు కనుమరుగయ్యే సరికి జగన్ ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా నాని త్రయం కనిపించకుండా పోయేసరికి వైసీపీలోనే ఒక రకమైన చర్చ ప్రారంభం అయింది.
కొడాలి నాని ఈ పేరు చెబితేనే ముందుగా గుర్తుకొచ్చేది గుడివాడ. గుడివాడ అంటేనే నందమూరి తారకరామారావు సొంత నియోజకవర్గం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రాంతం. ఆపై తెలుగుదేశం పార్టీ భావజాలం. అటువంటి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారిందంటే ముమ్మాటికి కారణం కొడాలి నాని. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి.. అదే పార్టీతో పాటు నాయకత్వానికి కొరకరాని కోయగా మారారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారారు. జగన్మోహన్ రెడ్డికి అసలు సిసలైన మద్దతుదారుడుగా నిలచారు. కానీ ఈ ఎన్నికల్లో సీన్ మారింది. కొడాలి నాని పత్తా లేకుండా పోయింది. కొడాలి నాని వస్తారని గుడివాడ వైసీపీ శ్రేణులు ఆశగా ఎదురుచూసే పరిస్థితికి వచ్చింది.
మరోవైపు బందరు నుంచి బరిలో నిలిచిన నాని జగన్కు అసలు సిసలైన మద్దతుతారు. స్ట్రాంగ్ నాయకుడు కూడా. 2019 ఎన్నికల్లో బందరు నుంచి గెలిచారు పేర్ని నాని. సిట్టింగ్ మంత్రి కొల్లు రవీంద్ర పై గెలిచేసరికి జగన్ గర్వంగా ఫీల్ అయ్యారు. నాని ని పిలిచి మంత్రిని చేశారు. తన కోసం నిలబడిన నాయకుడిని అందలమెక్కించారు జగన్. ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అన్నా ఈ ఎన్నికల్లో తాను నిలబడను.. నా కుమారుడికి లిఫ్ట్ ఇవ్వండి అన్నా అంటూ అడిగేసరికి కాదన్నారు జగన్. పేర్ని నాని కుమారుడు కిట్టుకు బందరు నుంచి అవకాశం ఇచ్చారు. కానీ జగన్ నమ్మకం వమ్ము అయింది. బందరు నుంచి కిట్టు ఓడిపోయారు. అటు తరువాత తండ్రి నాని కనిపించకుండా పోయారు. కూటమి ప్రభుత్వం కేసులతో భయపెట్టేసరికి బయటకు కనిపించకుండా మానేశారు. దీంతో బందరు నాని సైతం జగన్కు దూరమయ్యారు.
పోనీ ఎన్నికలకు ముందు తనకు చేరువైన కేసినేని నాని తన దగ్గర ఉన్నారంటే అది లేదు . ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడం.. ఓడిపోవడం ఇట్టే జరిగిపోయింది. ఇలా ఓటమి ఎదురయ్యేసరికి నేను పార్టీలో ఉండలేను అంటూ రాజకీయ సన్యాసం చేశారు. అటు తెలుగుదేశం పార్టీ సైతం ఆదరించకపోయేసరికి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలా నాని త్రయం జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీసింది.
మరోవైపు ఆళ్ల నాని ఏలూరు నుంచి ఓడిపోయారు. అప్పటివరకు మంత్రి హోదాను దక్కించుకొని ఆయన జగన్ పుణ్యమా అని మంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఏకంగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే నాని అనే పేరు జగన్మోహన్ రెడ్డికి కలిసి రాలేదు.