కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఓడిపోయినట్టు ఉంది ఏపీలో పరిస్థితి. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అసలు తాము ఉద్యోగులమా? కాదా? అన్న డిఫెన్స్ లో పడిపోయారు. జగన్ మానస పుత్రికగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటయింది. ప్రజలకు పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాలు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల చెంతకే పాలన తెచ్చేందుకు మహోన్నత ఆశయంతో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 11 శాఖలకు సంబంధించి కార్యదర్శులను నియమించి పాలనను మరింత సరళతరం చేశారు జగన్మోహన్ రెడ్డి. అది వరకు ఎన్నడూ లేని విధంగా పాలనా సౌలభ్యాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ప్రజలకు పాలన సౌలభ్యం తో పాటు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 11 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించారు. వారికి పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను అప్పగించారు. ప్రజల నుంచి వినతి వచ్చిందే తరువాయి పరిష్కార మార్గం చూపేలా సర్వ అధికారాలు వారికి ఇచ్చారు. ప్రజలు మండల కేంద్రాలకు, డివిజన్ కేంద్రాల ముఖం చూడకుండా.. స్థానికంగా సేవలు అందించేలా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. మున్ముందు ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి పంచాయతీలో సచివాలయం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.
అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరోలా తలచినట్టు.. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురైంది. సచివాలయ వ్యవస్థకు శాపంగా మారింది. సచివాలయ వ్యవస్థ అనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది. అయితే ప్రతి ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉన్నట్టే.. జగన్ సర్కార్ కు సచివాలయ వ్యవస్థ ప్రధానంగా మారింది. కానీ అదే వ్యవస్థ ఫెయిల్యూర్ గా కూటమి ప్రభుత్వానికి కనిపించింది. అందుకే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. సచివాలయాలను కుదించి.. కుచింపజేసి తాను అనుకున్నది సాధించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. అందుకే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం సచివాలయాలు అచేతనంగా మారనున్నాయి. మూడు గ్రేడ్లుగా విభజించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. పని భారం నెపంతో సచివాలయాల సేవలను సర్దుబాటు చేయాలన్న ఆలోచనలో ఉంది. గతం మాదిరిగా సచివాలయాల హక్కులు, విధులను హరింప చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల అవసరాలతో పాటు పని సర్దుబాటు పేరుతో సచివాలయ ఉద్యోగులను డివైడ్ చేసి ఆలోచన చేసింది కూటమి ప్రభుత్వం. ఇది ముమ్మాటికి సచివాలయ వ్యవస్థ పై పగ తీర్చుకోవడమేనని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. గతం మాదిరిగా తమ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు.