వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఏకంగా రాజధాని హోదా కల్పించారు. మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఈ ప్రాంతాన్ని అభివర్ణించారు. వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ఉత్తరాంధ్రను పాలన రాజధానిగా ప్రకటించినట్లు జగన్ సర్కార్ చెప్పుకొచ్చింది. 13 ఉమ్మడి జిల్లాల్లో ఉత్తరాంధ్రకు మునుపెన్నడూ లేని విధంగా గుర్తింపు ఇచ్చింది జగన్ సర్కార్. కానీ అదే జగన్ సర్కార్ ఔదార్యాన్ని గుర్తించలేకపోయింది ఉత్తరాంధ్ర. కేవలం 34 నియోజకవర్గాలకు గాను.. రెండు నియోజకవర్గాల్లో వైసిపి గెలిచిందంటే ఈ ప్రాంతపు ఆలోచనలు అర్థమవుతాయి. జగన్ మహోన్నత ఆశయంతో ఉత్తరాంధ్రను పాలనా రాజధానిగా ప్రకటిస్తే.. ఈ ప్రాంత ప్రజలు మాత్రం గుర్తించకపోవడం గమనార్హం.
వైసిపి ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఆ పార్టీని పెద్దగా ఆదరించలేదు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా వైసీపీ పోటీ చేసింది. 34 నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో వైసిపి విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 25 నియోజకవర్గాల్లో తన పట్టును నిలుపుకుంది. శ్రీకాకుళం జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లలో, విజయనగరం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో.. విశాఖ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో సత్తా చాటింది వైసిపి. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. ఆ ఎన్నికల్లో ఏకంగా వైసిపి 28 నియోజకవర్గాల్లో సత్తా చాటింది. తెలుగుదేశం పార్టీ విశాఖ నగరంలో నాలుగు నియోజకవర్గాల్లో, శ్రీకాకుళం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో సత్తా చాటింది. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి కనీసం బోనీ తెరవలేదు. అయినా సరే రెట్టింపు ఉత్సాహంతో 2024 ఎన్నికలకు సిద్ధపడింది తెలుగుదేశం పార్టీ. దానికి జనసేనతో పాటు బిజెపి బలం తోడైంది. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలకు గాను 32 నియోజకవర్గాల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. వైసిపి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
అంతులేని విజయం నుంచి.. అంతులేని ఓటమికి పరిమితం అయ్యింది వైయస్సార్ కాంగ్రెస్. అయితే విశాఖను పాలనా రాజధానిగా వైసీపీ ప్రకటించిన ఈ ప్రాంత ప్రజలు ఆహ్వానించలేదు. కనీసం వైసిపి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని పాలన రాజధానిగా ప్రకటించాలని చూశారు. కానీ అంత రాజకీయ దురుద్దేశంతోనే చూశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో రాజధానిగా ప్రకటించారు జగన్. అయితే కనీసం ఈ ప్రాంతీయులు ఆహ్వానించలేదు సరి కదా.. మిగతా ప్రాంతీయులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వైసీపీని దారుణంగా దెబ్బతీశారు. అయితే పాలన రాజధానిగా ఉత్తరాంధ్రను ఎంపిక చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించడంలో వైసీపీ విఫలమైంది. రాజకీయ కారణాలు చూపి కూటమి సక్సెస్ అయింది. ఎక్కడైనా రాజధాని వస్తుందంటే ఆ ప్రాంతీయులు సంతోషిస్తారు. అలా నిర్ణయం తీసుకున్న పార్టీని అందలం ఎక్కిస్తారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం వైసీపీకి పాడె కట్టారు. ఇది ముమ్మాటికి మూల్యం చెల్లించుకునేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అయితే ఉత్తరాంధ్ర పాలన రాజధానిగా ప్రకటించిన వైసిపి మూల్యం చెల్లించుకుంది. పాలన రాజధానిగా చేసిన ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించారు. తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న కోస్తాంధ్ర ప్రజలు దారుణంగా దెబ్బ కొట్టారు. చివరకు రాయలసీమ ప్రజలు సైతం తిరస్కరించారు. ఇలా అన్ని ప్రాంతాలకు చెడ్డ రేవడిగా మారింది వైసిపి. అయితే నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. ఇప్పుడు కాకపోయినా మరో నాలుగేళ్లలో కూటమి అసలు నిజం.. కూటమిలో ఉన్న అభిప్రాయం బయటపడక తప్పదు. అప్పుడు ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.