కొద్ది రోజుల క్రితం హీరో విశాల్ పేరు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినించింది. ఆయన వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారనే వార్త తెగ హల్ చేసింది. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచే హీరో విశాల్‌ను జగన్ రంగంలోకి దించుతున్నారని ప్రచారం జరిగింది. హీరో విశాల్ వైసీపీ నుంచి పోటీ చేస్తే.. ఖచ్చితంగా విజయం సాధిస్తారని చాలామంది తమ అభిప్రాయంగా వ్యక్తం చేశారు. జగన్‌కు విశాల్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో..హీరో విశాల్ కుప్పం బరిలో దిగడం ఖాయం అనుకున్నారు.కాని అప్పటికే కుప్పం బాధ్యతలను భరత్‌కు ఇచ్చేయడంతో… ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా హీరో విశాల్ తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఏపీకి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన సినిమా విశేషాలతో పాటు.. రాజకీయాల గురించి కూడా మాట్లాడటం జరిగింది. మా నాన్నగారు గ్రానైట్ కంపెనీలో చేసే సమయంలో మూడేళ్ల పాటు కుప్పంలో ఉన్నానని విశాల్ గుర్తు చేసుకున్నారు. కుప్పంలో 40 శాతం మంది తమిళ ప్రజలు ఉన్నారన్నారు. అక్కడి కార్మికులంతా బాగా తెలుసని విశాల్ చెప్పుకొచ్చారు. అక్కడ తెలియని పని లేదని చెప్పారు. కాట్పాడికి 22 కిలో మీటర్ల దూరంలో ఉందని వివరించారు. కుప్పంతో, ఆ ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ప్రత్యేకమని వెల్లడించారు. తనకు చెన్నై ఎలాగో..కుప్పం అంతేనని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావటం ఖాయమని విశాల్ స్పష్టం చేశారు.
రాజకీయాలంటే సమాజ సేవ అని..తాను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని .. వచ్చి ప్రజలకు సేవ చేస్తానని ఆయన ప్రకటించారు. . కుప్పంతో అనుబంధం ఉన్నదీ నిజమేనని..కానీ, తాను కుప్పం నుంచి పోటీ చేయటం లేదని విశాల్ తేల్చి చెప్పారు. విశాల్ ప్రకటనతో వైసీపీ అభ్యర్థి భరత్‌కు లైన్ క్లియర్ అయింది. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని అధికార వైసీపీ పార్టీ చాలా ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. . మంత్రి పెద్దిరెడ్డి కుప్పం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కుప్పంలో ఈ సారి గెలుపు ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కుప్పం ఫలితం ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరికి ఆసక్తి నెలకొంది.