నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వెర్సెస్ మంత్రి అన్నట్టు పరిస్థితి మారిందా? ఆ మంత్రిని ఎమ్మెల్యే తీవ్రంగా విభేదిస్తున్నారా? తన నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో వేలు పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లో ఒకేరోజు 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరు కాకపోవడం చర్చకు దారితీస్తోంది. ఈ అభివృద్ధి పనులకు ప్రజలే అతిథులంటూ శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పడం విశేషం.
నెల్లూరు నగరపాలక సంస్థ రెండు నియోజకవర్గాల్లో విభజించి ఉంది. 26 డివిజన్లతో రూరల్ నియోజకవర్గం ఉండగా.. 24 డివిజన్లతో సిటీ నియోజకవర్గం ఉంది. సిటీ నియోజకవర్గానికి మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూరల్ నియోజకవర్గానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉండి.. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణకు తెలియకుండా కో టంరెడ్డి శంకుస్థాపనలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇంకా 16 నెలల పదవీకాలం ఉండగానే తిరుగుబాటు చేశారు. శ్రీధర్ రెడ్డి చేరిక వెనుక మంత్రి నారాయణ ఉన్నారు. అయితే గెలిచిన నాటి నుంచి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తన మాట చెల్లుబాటు కావాలని మంత్రి నారాయణ భావిస్తున్నారు. ఇది కోటంరెడ్డికి మింగుడు పడడం లేదు. రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్లలో చేయి పెడితే ఊరుకునేది లేదని కోటంరెడ్డి హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
ఆ మధ్యన కార్పొరేషన్కు సంబంధించిన అధికారులు, ఉద్యోగుల బదిలీల్లో మంత్రి నారాయణ కలుగజేసుకున్నారు. కోటంరెడ్డి సిఫార్సులను పక్కన పెట్టేశారు. అప్పటినుంచి వారిద్దరి మధ్య వార్ నడుస్తోంది. తాజాగా అభివృద్ధి పనుల కేటాయింపులో విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే అభివృద్ధి పనుల శంకుస్థాపన విషయంలో మంత్రి నారాయణను సైతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కన పడేయడం చర్చకు దారితీస్తోంది. హై కమాండ్ కు ఈ విషయం మంత్రి నారాయణ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.